Amaravati: న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. 684 రోజులుగా.. వివిధ రూపాల్లో..

Amaravati: న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. 684 రోజులుగా.. వివిధ రూపాల్లో..
Amaravati: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న పోరాటం మరింత ఉధృతమవుతోంది.

Amaravati: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న పోరాటం మరింత ఉధృతమవుతోంది. అమరావతి ఆవశ్యకతను తెలియజేసేందుకు రైతులు సోమవారం నుంచి మహాపాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఉదయం 9 గంటల ఐదు నిమిషాలకు తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి మహా పాదయాత్ర ప్రారంభమవుతుంది.

డిసెంబర్‌ 17 తిరుమలలో యాత్ర ముగుస్తుంది. తిరుమల సన్నిధికి వెళ్తున్నందున యాత్రలో స్వామివారి విగ్రహం ఉంచిన వాహనం ముందువరుసలో.. ఆ తర్వాత కళాకారుల బృందాలు, మహిళలు, రైతులు, పాదయాత్రకు మద్దతు తెలిపేవారు ఇలా వరుస క్రమంలో సాగుతారు. తొలి రోజు యాత్రలో రైతులు ఏఢు కిలోమీటర్ల దూరంలోని పెదపరిమికి చేరుకొని అక్కడ భోజనం చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి మరో ఏడు కిలోమీటర్లు నడిచి తాడికొండలో రాత్రికి బస చేస్తారు.

న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో నిర్వహిస్తున్న యాత్ర దిగ్విజయంగా కొనసాగాలంటూ తుళ్లూరు దీక్షా శిబిరంలో పూజలు నిర్వహించారు రైతులు. శ్రీలక్ష్మీగణపతి హోమం, నవగ్రహ హోమం.. కాల భైరవ హోమం నిర్వహించారు. మహిళలు భారీగా తరలివచ్చారు. పాదయాత్రకు సంబంధించి గీతం కూడా విడుదలైంది.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు 684 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ 29 గ్రామాలకే పరిమితమై సాగుతున్న ఈ పోరాటం.. పాదయాత్ర ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించనుంది. 4 జిల్లాల మీదుగా.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర సాగనుంది. రోజూ రెండు విడతలుగా 14 కిలోమీటర్లు సాగేలా ప్రణాళిక రూపొందించారు.

ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 20 రకాల కమిటీలను నియమించారు. పాదయాత్ర ద్వారా అమరావతి ఆవశ్యకతను ప్రతి గ్రామానికి, రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని జెఎసి నేతలు చెబుతున్నారు. రాజధాని రైతుల పాదయాత్రకు తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు మద్దతు తెలిపాయి. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ సంఘీభావం ప్రకటించారు.

తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం- ఐ టీడీపీ ప్రతినిధులు యాత్రలో పాల్గొనున్నట్లు తెలిపారు. రాజధానిని ముడుముక్కలు చేయడాన్ని నిరసిస్తూ మహా పాదయాత్రకు టీడీపీ పూర్తి మద్దత్తు ఇస్తున్నట్లు ఆపార్టీ నేతలు ప్రకటించారు. చంద్రబాబు అమరావతికి ప్రాణం పోస్తే జగన్‌ ఊపిరి తీస్తున్నారని మండిపడ్డారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీలు అమరావతి మహాపాదయాత్ర కు పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు నసీర్‌ ఆహ్మద్‌ చెప్పారు.

ఇన్నాళ్లు అమరావతికే పరిమితమైన రాజధానిరైతుల ఉద్యమం.. తొలిసారి అమరావతి దాటి రాష్ట్ర వ్యాప్తం కానుంది. కరోనా వంటి మహామ్మారి సమయంలోనూ ఉక్కసంకల్పంతో దీక్షలు చేసిన అమరావతి రైతుల ఈ మహాపాదయాత్ర ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించడం ఖాయం.

Tags

Read MoreRead Less
Next Story