అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె!

అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె!
రాజధాని నిర్మాణం జరుగుతుందని, తమ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని కలలు కన్నాడు.

అమరావతి పోరాటంలో మరో గుండె ఆగిపోయింది.. మందడం గ్రామానికి చెందిన రైతు గుండెపోటుతో మృతిచెందాడు.. బెజవాడ ఓబయ్య రాజధాని నిర్మాణం కోసం తన 85 సెంట్ల భూమిని అప్పటి ప్రభుత్వానికి ఇచ్చాడు.. రాజధాని నిర్మాణం జరుగుతుందని, తమ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని కలలు కన్నాడు.. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని విశాఖకు తరలిస్తున్నామంటూ ప్రకటన చేయడంతో అప్పటి నుంచి ఆందోళన చెందుతున్నాడు. 29 గ్రామాల రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొంటున్నాడు.. ఈ నేపథ్ంయలోనే రాజధాని తరలిపోతుందని మనస్తాపానికి గురైన ఓబయ్యకు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోగానే ఓబయ్య చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అమరావతి ఉద్యమం 461వ రోజుకు చేరుకుంది.. రాజధాని గ్రామాల్లోని శిబిరాల్లో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని మండిపడుతున్నారు. తమ ప్రాణాలైనా అర్పిస్తాం గానీ, రాజధానిని మాత్రం తరలిపోనివ్వమంటున్నారు.. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి గ్రామాల్లో దీక్షా శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదంటున్నారు రైతులు. కరోనా సూచనలు పాటిస్తూనే నిరసనలు తెలియజేస్తున్నారు.

ఇక రాజధాని దీక్షా శిబిరాల్లో అమరావతి నినాదంతోపాటు విశాఖ ఉక్కు నినాదం కూడా మారుమోగుతోంది.. విశాఖ ఉక్కును కూడా సాధించుకుంటామని అమరావతి రైతులు చెబుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అమరావతి రైతులు, మహిళలు నినదిస్తున్నారు.. రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story