ఇళ్ల పట్టాలపై కోర్టు స్టే.. జగన్ వ్యాఖ్యలపై రాజధాని రైతులు ఆగ్రహం

ఇళ్ల పట్టాలపై కోర్టు స్టే.. జగన్ వ్యాఖ్యలపై రాజధాని రైతులు ఆగ్రహం
అమరావతి రాజధాని భూములను పేదలకు పంచడంపైనా సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు.

అమరావతిపై మరోసారి కులం ముద్ర వేశారు జగన్. రాజధానిలో అన్ని కులాల వాళ్లు ఉండాలంటూ మాట్లాడారు. అంటే.. అమరావతిలో ఒకే సామాజికవర్గం ఉందంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తున్న వాళ్లు ఒకే సామాజికవర్గం వాళ్లు అంటూ కొంతకాలంగా కులం ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. ఒక సామాజికవర్గం వారి భూములు పోతాయనే భయంతోనే రాజధాని కోసం పోరాడుతున్నారని వైసీపీ నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. దీంతో తమ ప్రాంతంలో ఏయే సామాజికవర్గం వాళ్లు ఉన్నారో రాజధాని రైతులులెక్కలతో సహా చెప్పారు. దళితులు సైతం స్పందించి.. రాజధాని కోసం భూములు ఇచ్చామని చెప్పారు. అమరావతి పోరాటానికి ఏడాది అయిన సందర్భంగా.. బహిరంగ సభ ప్రాంగణంలోనే దళితులు నిరాహార దీక్ష కూడా చేపట్టారు. కాని, జగన్‌ మాత్రం.. రాజధానిలో అన్ని కులాలు ఉండాలంటూ మాట్లాడారు. దీనిపై వివాదం చెలరేగుతోంది.

అమరావతి రాజధాని భూములను పేదలకు పంచడంపైనా సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో 54 వేల మంది పేదలకు పట్టాలివ్వాలని భావించినప్పటికీ.. గత ప్రభుత్వానికి చెందిన వాళ్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారంటూ కామెంట్ చేశారు.

ఆ పిటిషన్‌ను చూసి కోర్టు స్టే ఇవ్వడం తనకు ఆశ్చర్యంగా అనిపించిందంటూ జగన్ కామెంట్ చేయడంపైనా రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ హైకోర్టు తీర్పును వక్రీకరించి, అవాస్తవాలు చెప్పడం సరికాదన్నారు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు ఇస్తామనడం, మాస్టర్‌ ప్లాన్‌లోని జోన్లను మార్చడంపైనే కోర్టును ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. పిటిషన్లలో ఎక్కడా కుల ప్రస్తావన లేదని తెలిపారు.

టీడీపీ కూడా జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని ప్రాంతంలో స్థానికులకు కాకుండా బయటి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని తప్పు పడుతూ కోర్టుకు వెళ్లాం తప్ప.. పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడాన్ని అడ్డుకోలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చే స్థలాలను ఏడాది తర్వాత విక్రయించుకోవచ్చన్న జీవో చట్ట విరుద్ధం కాబట్టే కోర్టు తప్పుపట్టిందని టీడీపీ విమర్శించింది.

అమరావతిలో అన్ని కులాలు, మతాలు, సంస్కృతుల ప్రజలు కలిసి జీవిస్తున్నా.. జగన్‌ చూడలేకపోతున్నారంటూ రాజధాని పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి మండిపడ్డారు. అమరావతిలో కేవలం ఒకే సామాజికవర్గం కనపడడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags

Read MoreRead Less
Next Story