ఇన్‌సైడర్ ట్రేడింగ్ లో తేల్చింది ఏంటి..?

ఇన్‌సైడర్ ట్రేడింగ్ లో తేల్చింది ఏంటి..?
అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి తేల్చింది ఏంటి..? అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిజమేనా? అదే నిజమైతే దాన్ని నిరూపించే ఆధారాలేవి? మంత్రివర్గ ఉపసంఘం పేరుతో శోధించిన..

అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి తేల్చింది ఏంటి..? అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిజమేనా? అదే నిజమైతే దాన్ని నిరూపించే ఆధారాలేవి? మంత్రివర్గ ఉపసంఘం పేరుతో శోధించిన అంశాల్లో ఏ ఒక్కదానికీ సరైన పొంతన ఎందుకు లేదు? దీన్నిబట్టి చూస్తుంటే ఇదంతా రాజధానిపై కుట్రలో భాగంగానే జరిగిందనే వాదన బలపడుతోంది. గతేడాది జూన్‌ 26న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైన తర్వాత భూలావాదేవీలపై ఎలాంటి రిపోర్టు ఇస్తారో అని అంతా ఉత్కంఠగా చూస్తే కొత్తగా కనిపెట్టింది, రాబట్టింది ఏమీలేదనే విషయం అర్థమైంది. ప్రస్తుత సచివాలయ ప్రాంతానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో భూములు కొన్నా సరే వాటిని కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్ కిందే చూపించడం, కృష్ణా జిల్లాలో కొన్న భూముల్ని కూడా వీటిల్లో కలిపి లెక్కేయడం బట్టి చూస్తే ఇదంతా డొల్ల నివేదిక అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం 2014 సెప్టెంబరులో అసెంబ్లీలో ప్రకటన చేసింది. అయితే ఆ ఏడాది డిసెంబరులో సీఆర్‌డీఏ చట్టం వచ్చినప్పటి నుంచి మాత్రమే రాజధానిగా పరిగణిస్తామని.. అంతకుముందు అక్కడ జరిగిన భూముల లావాదేవీలన్నీ ఇన్‌సైడర్‌ ట్రేడింగేనని జగన్‌ సర్కారు పదే పదే అనడం హాస్యాస్పదంగా ఉందని రాజధాని వాసులు.. విపక్షాలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చట్టం రాకముందే అనేక మంది భూములు కొనుక్కున్నారన్న విషయాన్ని బూచిగా చూపి గత ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని.. రాజధానిని తరలించడానికి దీనిని సాకుగా ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.

రాజధాని ఎక్కడ రానుందో ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు బహిరంగంగా ప్రకటించిన తర్వాత జరిగిన కొనుగోళ్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం అక్రమాల పరిధిలోకి తీసుకురావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానికి కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని తాము భావిస్తున్నట్లు 2014 జులై 22న రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై ఏర్పాటు చేసిన సలహా కమిటీ ఛైర్మన్‌, అప్పటి మంత్రి డాక్టర్‌ పి.నారాయణ అధికారికంగానే ప్రకటించారు. ఈ విషయాన్ని అదే రోజు కేంద్రం రాజధానిపై ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్‌ కమిటీ సభ్యులకు కూడా చెప్పారు. ఆ అంశాలన్ని మరుసటి రోజు అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014 జూన్‌ 8న ప్రమాణస్వీకారం చేశారు. దానికి నెల తర్వాత రాజధానిపై దాదాపుగా ఒక నిర్ణయానికి వస్తూ ప్రకటనలు కూడా వచ్చాయి. వీటి ఆధారంగా భూములు కొనుకోళ్లు చేసిన వారిని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చూపిస్తోంది ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం.

విజయవాడ-గుంటూరు మధ్య రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం 2014 సెప్టెంబరు 1న నిర్ణయించింది. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున ఆరోజు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా మీడియా ద్వారా ఈ సమాచారం అందరికీ తెలిసింది. మూడురోజుల తర్వాత నాలుగో తేదీన శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానికి జరిగిన స్థల ఎంపికపై అధికారికంగా ప్రకటన చేశారు. అమరావతే రాజధాని అటూ జులై 2నే జాతీయ పత్రికలు, రాష్ట్ర మీడియాలో వార్తలు ప్రముఖంగా వచ్చాయి. . ఒక ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు వస్తుందనే అనధికార సమాచారం పత్రికల్లో వస్తే దాన్ని బట్టి కూడా డబ్బున్నవారు ఆ ప్రాంతంలో భూములపై పెట్టుబడులు పెట్టడం సర్వసాధారణం. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వంలో రాజధాని వ్యవహారాలు చూసే మంత్రి స్పష్టంగా సంకేతాలు ఇచ్చాక, ఫలానాచోట రాజధానిని పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించాక జరిగిన క్రయవిక్రయాలనూ అక్రమంగా చూడటం ఎలా సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.

రాజధానిలో అక్రమాలు జరిగాయనే సమాచారంపై పరిశీలనకు ప్రస్తుత ప్రభుత్వం 2019 జూన్‌లో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. రాజధాని నగరం, ప్రాంతం కింద ప్రకటించిన ప్రాంతాలలో 2014 జూన్‌ 1 నుంచి 2014 డిసెంబరు 31 వరకూ, అంటే ఈ 7 నెలల కాలంలో జరిగిన భూముల క్రయవిక్రయాలను అది పరిగణనలోకి తీసుకుంది. వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన తరువాత రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగా సమాచారం తెలిసినవారు 4 వేల 69 ఎకరాలను కొన్నారని ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. రాజధాని నోటిఫికేషన్‌కు ముందే ఈ భూములను తక్కువ ధరకు కొన్నారని పేర్కొంటూ ఇదంతా ఒక అక్రమం అన్నట్లుగా విశ్లేషించింది. కానీ నోటిఫికేషన్‌ అనేది కేవలం సాంకేతిక ప్రక్రియ మాత్రమేనేది అందరికీ తెలిసిన విషయమే. రాజధాని ఫలానా చోట అని మంత్రివర్గం తీర్మానం చేసి, ముఖ్యమంత్రి అధికారికంగా శాసనసభలో ప్రకటించడంకంటే ప్రజలకు కావాల్సిన స్పష్టత ఇంకేముంటుందిని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలో భూములు కొనుగోలు చేసినా వాటిని కూడా మంత్రివర్గ ఉపసంఘం తప్పుపట్టడమే చర్చనీయాంశమైంది. CRDA పరిధిని మొత్తాన్ని తీసుకుని ఎక్కడో దూరంగా 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో భూములు కొన్నా అది ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనడం అర్థరహితమంటున్నారు. ఇదంతా పథకం ప్రకారం అమరావతిని సమాధి చేసే కుట్రేననేది రైతుల వాదన. అలాగే కృష్ణా జిల్లాలో కొనుగోలు చేసిన భూములను కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనడం బట్టే ఉద్దేశపూర్వకంగానే ఇదంతా ప్రచారం చేస్తున్నారనే విషయం స్పష్టమైందంటున్నారు.

ఉపసంఘం చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే.. 2014 జూన్ నెలలో గుంటూరు జిల్లాలో 261 ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగింది. కృష్ణా జిల్లాలో 286 ఎకరాల భూలావేదేవీలు జరిగాయి. ఈ 530 ఎకరాల భూమి కోర్ కేపిటల్ ప్రాంతంలో లేకపోయినా ఆ కొనుగోళ్లు, అమ్మకాలు అన్నీ లోపాయకారీగా జరిగినవేనని సబ్‌కమిటీ తేల్చేసింది. ఇక జులైకి వస్తే గుంటూరు జిల్లాలో 309 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 375 ఎకరాలు అమ్మకాలు జరిగాయి. వీటినీ ఇన్‌సైడర్ ఖాతాలోనే వేసి చూపించారు. అంతెందుకు సెప్టెంబర్‌లో రాజధానిపై చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశాక జరిగిన కొనుగోళ్లు కూడా అక్రమమేననేది అధికార పక్షం మాట. రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగిన భూలావాదేవీలు, రిజిస్ట్రేషన్లు ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటున్నారు. సీఆర్‌డీఏ చట్టం అమల్లోకి వచ్చే వరకూ జరిగినవన్నీ ఆ ఖాతాలోనే చూపించి ఏదో అవినీతి జరిగిపోయింది అని తమ వాదన సమర్థించుకునేందుకే ప్రాధాన్యత ఇస్తూ లెక్కలు చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడే రాజధాని రైతులు, విపక్షాలు ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. హైదరాబాద్‌ నగరాన్నే తీసుకుంటే ప్రస్తుతం దాని విస్తీర్ణం 100 చదరపు కిలోమీటర్ల పరిధి వరకూ ఉంటుంది. ఈ లెక్కన చూస్తే.. విశాఖలో రాజధాని ఉంటుందని చెప్పక ముందునుంచే భారీగా క్రయ విక్రయాలు జరిగాయని.. ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పటి నుంచి భారీగా కొనుగోళ్లు జరిగాయి.. ముఖ్యంగా విశాఖ చుట్టూ వైసీపీ కొనుగోళ్లు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story