ఏపీ, తెలంగాణ మధ్య తెగని నీళ్ల పంచాయితీ

ఏపీ, తెలంగాణ మధ్య తెగని నీళ్ల పంచాయితీ
AP and Telangana: ఏపీ పట్టిన పట్టు వీడటం లేదు.. తెలంగాణ అడుగు కూడా వెనక్కు తగ్గడం లేదు.

ఏపీ పట్టిన పట్టు వీడటం లేదు.. తెలంగాణ అడుగు కూడా వెనక్కు తగ్గడం లేదు.. కృష్ణా నీటి వాటాల విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఏడాది కాలంగా వివాదంగా వున్న పలు కీలక అంశాలు ఈనెల 27న జరిగే బోర్డు సమావేశంలో ప్రధాన ఎజెండా కానున్నాయి.. గత కొద్ది నెలలుగా కృష్ణా బేసిన్‌కు సంబంధించిన అనేక అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య మాటలు, లేఖల యుద్ధానికి కారణమవుతున్నాయి. రెండు రాష్ట్రాలు ఎంతకూ తగ్గకపోవడంతో కేంద్ర జల సంఘం, కృష్ణా బోర్డు కూడా నిస్సహాయత వ్యక్తం చేసిన పరిస్థితి. వీటితోపాటు కొత్త అంశాలు కూడా బోర్డు సమావేశంలో చర్చకు రానున్నాయి.

కృష్ణా బేసిన్‌లో ప్రస్తుత ఏడాదికి ఏపీ, తెలంగాణకు 70:30 నిష్పత్తిలో జలాలను పంచాలని ఏపీ డిమాండ్‌ చేస్తోంది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-2 తీర్పు వచ్చేవరకూ ఇదే నిష్పత్తిలో కొనసాగాలంటోంది. నాగార్జున సాగర్‌ ఎడమ విద్యుత్తు కేంద్రం, పులిచింతలలో ఉత్పత్తి చేసే విద్యుత్తులో తమకూ వాటా ఉందని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ జల వనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ లేఖ రాశారు. అయితే, తెలంగాణ మాత్రం కృష్ణా జలాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ వాటా కోసం పట్టుపడుతోంది.. గత ఏడాది వరకూ 66:34 నిష్పత్తిలో వినియోగం జరగ్గా, ఈ ఏడాది 50:50 నిష్పత్తిలో కేటాయించాల్సిందేనని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అనేది 2015-16లో చేసుకున్న తాత్కాలిక ఒప్పందమని అంటోంది. ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తోంది. ఈ అంశాన్ని ఈ నెల 27న జరిగే బోర్డు సమావేశంలో ఎజెండాగా చేర్చారు. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై ఏపీ రాసిన లేఖకు ప్రాధాన్యం ఏర్పడింది.

గోదావరి నుంచి తెలంగాణ 214 టీఎంసీలను కృష్ణా బేసిన్‌లోకి మళ్లిస్తోందని ఏపీ ఆరోపిస్తోంది. ఇలా నీటిని మళ్లించే చోట టెలిమెట్రీ ఏర్పాటు చేసి ఎంత మళ్లిస్తున్నదీ నిర్ధారించాలని లేఖలో కోరింది. ఈ ఏడాది జూన్‌ రెండు నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతలలో తెలంగాణ అనధికారికంగా విద్యుదుత్పత్తి చేసిందని.. నీటి కేటాయింపు కోసం కృష్ణా బోర్డును తెలంగాణ సంప్రదించలేదని ఆరోపించింది. నీటి విడుదలకు బోర్డూ ఆదేశాలు ఇవ్వలేదని.. ఈ నీటిని తెలంగాణకు ఉన్న 299 టీఎంసీలలో భాగంగానే చూడాలన్నది ఏపీ చేస్తున్న వాదన. నాగార్జున సాగర్‌ కుడి విద్యుత్తు కేంద్రం, టెయిల్‌పాండ్‌ విద్యుత్తు కేంద్రం రెండూ ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోనే ఉన్నాయి కాబట్టి ఇవి తమకే చెందుతాయని లేఖలో వెల్లడించింది. పులిచింతల విద్యుదుత్పత్తి కేంద్రం తెలంగాణలోనే ఉన్నా, దిగువన ఆయకట్టు ఆంధ్రప్రదేశ్‌దని.. ఈ అవసరాలకు తగ్గట్లుగా నీరు విడుదల చేయాలి కాబట్టి.. విద్యుదుత్పత్తిలో వాటా పంపిణీ జరగాలని బోర్డుకు రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్‌ పట్టుబట్టింది. దీంతో బోర్డు సమావేశంలో ఇదే ప్రధానాంశం కానుంది. వరద సమయంలో విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా విడుదల చేసే నీటిని లెక్కలోకి తీసుకోవాలా లేదా అనేది సమావేశంలో బోర్డు నిర్ణయించనుంది.

ఓవైపు నీళ్ల వివాదం నడుస్తుంటే.. మరోవైపు కేఆర్‌ఎంబీ కార్యాలయం తరలింపు అంశంపై వివాదం నెలకొంది.. బోర్డును బేసిన్‌ దాటి పెడతామంటే ఒప్పుకునేది లేదని తెలంగాణ చెబుతోంది. కృష్ణా బేసిన్‌ లోపలే.. కేఆర్‌ఎంబీ కార్యాలయం ఉండాలంటోంది. బేసిన్‌ అవతలికి తరలిస్తామంటే అడ్డుకోవాలని తెలంగాణ నిర్ణయించింది. ఈ నెల 27న జరగనున్న బోర్డు సమావేశంలో దీన్ని ఎజెండాగా చేర్చారు. కార్యాలయ ఖర్చు, రవాణా చార్జీలు ఎవరు భరించాలని తెలంగాణ ప్రశ్నిస్తోంది. త్రిసభ్య కమిటీ, బోర్డు సమావేశాలు జరిగినప్పుడల్లా అక్కడికి వెళ్లిరావడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న అంశమని పేర్కొంది. కర్నూలు, విజయవాడ, శ్రీశైలంలో ఎక్కడకు తరలించినా.. అభ్యంతరం లేదని బోర్డు సమావేశంలో స్పష్టం చేస్తామంటున్నారు తెలంగాణ అధికారులు..


Tags

Read MoreRead Less
Next Story