25వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు ఉద్యమం

25వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు ఉద్యమం
విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు చేపట్టిన ఆందోళనలు 25వ రోజుకు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఒకటే ఉక్కు సంకల్పం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఎగిసిపడుతున్న ఉద్యమం. ప్రజలంతా ఒక్కటై నినదిస్తున్న నినాదం. బిజెపి మినహా పార్టీలకతీతంగా అధికార, విపక్షాలు, కార్మిక, మహిళ, విద్యార్థి, ప్రజా సంఘాలు ఐకమత్యంగా సాగిస్తున్న పోరాటం. మోడీ సర్కారుపై లక్షలాది గొంతులు గళమెత్తగా.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు చేపట్టిన ఆందోళనలు 25వ రోజుకు చేరుకుంది.

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు హోరెత్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలు అన్ని జిల్లాల్లోను ధర్నాలు, రిలే దీక్షలు, మానవహారం, నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. స్టీల్‌ప్టాంట్‌ అమ్మే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాల నేతలు అంటున్నారు.

ఉత్తరాంధ్ర, కోస్తా, విజయవాడ, రాయలసీమ ప్రాంతాలు విశాఖ ఉక్కు ధర్నాలతో దద్దలిల్లుతోంది. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని ప్రజలు హెచ్చరిస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఇటీవల ఏపీ బంద్‌కు కార్మిక, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు బిజెపియేతర పార్టీలన్నీ మద్దతు పలికాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా.. విద్యా, వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా నిరసనలు తెలిపాయి. స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండేలా కేంద్రంతో చివరిదాకా పోరాడుతామని నేతలు తెలిపారు. మోదీ ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని.. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇక నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉభయసభల్లో ఏపీ ఎంపీలు గట్టిగా గళమెత్తాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. తొలిదశలో కేంద్రం ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటుపరం ప్రకటనపై లోక్‌సభలో వైసీపీ ఎంపీలు మాట్లాడలేదని.. ఈసారైనా వ్యతిరేకిస్తూ ఉభయసభల్లో గట్టిగా పోరాటం చేయాలంటున్నారు. మోదీ సర్కారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు వెనక్కి తగ్గొదంటున్నారు. విశాఖ ఉక్కుపై విజయం సాధించాకే ఆంధ్రా గడ్డపై కాలుమోపాలని ఎంపీలకు ప్రజలు అల్టిమేటం ఇచ్చారు. మరి పార్లమెంట్ సమావేశాలు సాగుతున్న వేళ.. స్టీల్‌ప్లాంట్‌పై ఏపీ ఎంపీలు ఎలాంటి పోరాటం సాగిస్తారో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story