విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో ఏపీ సర్కార్ చెలగాటం ఆడుతోందా?

విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో ఏపీ సర్కార్ చెలగాటం ఆడుతోందా?
విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో ఏపీ సర్కార్ చెలగాటం ఆడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి ప్రాణాలంటే లెక్కలేని తనంగా ప్రభుత్వ వ్యవహర శైలి..

విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో ఏపీ సర్కార్ చెలగాటం ఆడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి ప్రాణాలంటే లెక్కలేని తనంగా ప్రభుత్వ వ్యవహర శైలి కనిపిస్తోంది. కరోనా ముంపు ఇంకా పూర్తిగా తొలగకముందే.. ఆదరబాదరగా స్కూళ్లు తెరవడంతో ఇప్పుడు ఏపీలోని పాఠశాలలు కొవిడ్‌ బఫర్‌ జోన్లుగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల్లో వందలాది మంది విద్యార్ధులు, ఉపాధ్యాయులు ఆ మహమ్మారి బారినపడుతున్నారు. పాఠశాలలు ప్రారంభమై మూడు రోజుల కూడా కాక ముందే.. కరోనా కోరలు చాస్తుండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ సోకడమే కాదు..ప్రాణాలు కూడా కోల్పోతుండడం భయాందోళనలు సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్‌ ఓ ఉపాధ్యాయుడ్ని బలిగొంది. బుచ్చినాయుడు కండ్రిగ మండలం గోవిందప్ప నాయుడు కండ్రిగ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రెడ్డిపల్లి దినేష్ కరోనాతో మృతిచెందాడు. చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

ఏపీ స్కూళ్లలో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా బుసలు కొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఇప్పటివరకు 829మంది ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్టు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 9, 10 విద్యార్థులకు ఈనెల 2 నుంచి రోజువిడిచి రోజు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తంగా 41,623 ప్రభుత్వ పాఠశాలల్లో 70,790 మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేయగా.. 829మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే, 95,763 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. 575మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది.

పశ్చిమగోదావరి జిల్లా స్కూళ్లలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 172 మంది ఉపాధ్యాయులు, 262మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. చిత్తూరు జిల్లాలోని పలు స్కూళ్లలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 150 మంది ఉపాధ్యాయులు, 9 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కర్నూలు జిల్లాలోని పాఠశాలల్లోనూ కరోనా పంజా విసురుతోంది. ఇప్పటి వరకు 34 మంది టీచర్లు, 124 మంది విద్యార్ధులకు కరోనా వచ్చింది. అటు విశాఖ జిల్లాలోని స్కూళ్లల్లో 52 మందికి కరోనా సోకింది. వారిలో 46 మంది ఉపాధ్యాయులు, నలుగురు సిబ్బంది, ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మరికొంతమంది ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో మిగతా విద్యార్థుల్లో భయం నెలకొంది. టెస్ట్‌లు చేసుకునేందుకు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. నల్లజర్ల మండలం సింగరాజుపాలెం హైస్కూల్‌లో 12 మంది విద్యార్ధులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా బారిన పడ్డారు.గత నెల 26న పరీక్షలు నిర్వహించగా.. ఈ నెల 4న ఫలితాలు వచ్చాయి.గుంటూరు జిల్లాలో మొత్తం 25 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. రేపల్లె నియోజకవర్గంలో ఓ విద్యార్ధితో పాటు అతని తండ్రికి కూడా కరోనా సోకింది.

కరోనా ప్రభావం తగ్గిందంటూ స్కూళ్లు తెరిచిన ప్రభుత్వం..వైరస్‌ నియంత్రణ చర్యల్లో మాత్రం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీగా కరోనా బారినపడుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ముంపు పొంచి ఉందని ఓ వైపు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఆవేవి పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించి విద్యార్థులు, ఉపాద్యాయుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఇప్పటికే వందల్లో కరోనా పాటిజివ్‌లు రాగా.. ఈలోపు మరెంత మందికి కరోనా సోకిందో అన్న ఆందోళన విద్యార్ధుల్లో నెలకొంది. ఇదిగాక.. రెండో, మూడో దశల్లో 8వ తరగతి నుంచి 1వ తరగతి స్కూళ్లు కూడా తెరవనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో.. కరోనా విజృంభణ ఇంకాస్త పెరిగే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పిల్లల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. స్కూళ్లు ఓపెన్‌ చేశాం ఇక మాపనైపోయినట్టు వ్యవహరిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story