కొండపల్లి అడవుల్లో మైనింగ్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

కొండపల్లి అడవుల్లో మైనింగ్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kondapalli: కొండపల్లి అడవుల్లో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

Kondapalli: కొండపల్లి అడవుల్లో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పంట కాలువను పూడ్చేసి దానిపై రహదారి, స్ట్రోన్‌ క్షషర్‌ నిర్మాణాలు చేపట్టిన వారు కొండపల్లి అటవీ భూమిని ఆక్రమించి మైనింగ్‌కు పాల్పడలేదంటే ఎలా నమ్మాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.. కాలువ మాత్రమే ఆక్రమించారని, అటవీ భూమి ఆక్రమణకు గురి కాలేదని ప్రభుత్వం చెబుతున్న మాట జీర్ణించుకోవడానికి కష్టగా ఉందంటూ ఘాటుగానే వ్యాఖ్యానించింది.

కొండపల్లి అటవీ భూమిని ఆక్రమించి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న పలువురు, పరిటాల గ్రామ పరిధిలోని 8.6 కిలోమీటర్ల మేర ఇబ్రహీంపట్నం మెయిన్‌ కెనాల్‌ను కనుమరుగు చేశారని దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపించారు. పంట కాలువను పూడ్చి నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవమేనన్నారు. గనుల రవాణాకు రహదారిని ఏర్పాటు చేసుకున్నారని కోర్టుకు తెలిపారు. 2018లోనే అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు జారీచేశారని తెలిపారు. అయితే, అటవీ భూమి ఆక్రమణకు గురి కాలేదన్నారు. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ గనుల తవ్వకం జరిగిన ప్రాంతంలో శాటిలైట్‌ ఇమేజ్‌లు ఇవ్వాలని స్పష్టం చేసింది.

నోటీసులు ఇచ్చిన తర్వాత పురోగతి ఏంటని ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని మరోసారి పరిశీలించాలని, పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, గనుల శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story