ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. గవర్నర్‌తో భేటీ కానున్న ఎస్‌ఈసీ రమేష్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. గవర్నర్‌తో భేటీ కానున్న ఎస్‌ఈసీ రమేష్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాజకీయ పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్‌. పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని.. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ విశ్వభూషణ్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం భేటీ కానున్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన గవర్నర్‌కు వివరిస్తారని తెలుస్తోంది.

ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని.. కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయిందన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరం అన్న నిమ్మగడ్డ.. తెలంగాణ జీహెచ్‍ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదని స్పష్టం చేసిన నిమ్మగడ్డ.. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు.

ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ సూచించారు. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు ఎంతో అవసరమన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

ఇటీవల గవర్నర్‌తో భేటీ అయిన సీఎం జగన్.. స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని గవర్నర్‌కు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఐతే.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story