ఏపీలో పంచాయితీ ఎన్నికలు..అమల్లోకి ఎన్నికల కోడ్‌

ఏపీలో పంచాయితీ ఎన్నికలు..అమల్లోకి ఎన్నికల కోడ్‌
సుప్రీంకోర్టు ఆదేశాలను.. ప్రభుత్వం అమలు చేయలేదని ఎస్‌ఈసీ తప్పుబట్టారు.

ఏపీలో పంచాయితీ ఎన్నికలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించారు SEC నిమ్మగడ్డ రమేష్‌ కుమార్. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేశారు. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. శనివారం నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ప్రకటించారు ఎస్‌ఈసీ. ఈ నెల 23 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. 23న తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడదల కానుంది. తొలిదశ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరనున్నాయి. ఇక రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్‌.. ఈ నెల 27న విడుదల కానుంది. రెండో దశ ఎన్నికలు ఫిబ్రవరి 9న జరగనున్నాయి. మూడవ దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 31న, ఎన్నికలు ఫిబ్రవరి 13న జరుగుతాయి. నాలుగో దశ నోటిపికేషన్‌ ఫిబ్రవరి 4న విడుదల కానుంది. పోలింగ్‌ ఫిబ్రవరి 17న ఉంటుంది. ఉదయం ఆరున్నర నుంచి మధ్నాహ్నం మూడున్నర వరకు పోలింగ్ ఉంటుందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు..నాలుగు దశల్లోనూ పోలింగ్‌ జరిగిన రోజునే కౌంటింగ్ కూడా చేసేలా ఏర్పాట్లు

ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకునే ముందు.. సుప్రీం ఆదేశాల మేరకు ప్రభుత్వంతో ఎస్‌ఈసీ సంప్రదింపులు జరిపిందని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. కరోనా, వ్యాక్సిన్ పరిస్థితులను ఎస్‌ఈసీ నిశితంగా గమనించిందని, ప్రభుత్వ పథకాలు ప్రారంభించే ముందు ఎస్‌ఈసీ అనుమతి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను.. ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన తప్పుబట్టారు. కరోనా సెకండ్ వేవ్ సాకుతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలంటోందని, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని కొట్టిపారేశారు. భయానక పరిస్థితులున్న అమెరికాలోనే ఎన్నికలు జరిగాయని ఎస్‌ఈసీ రమేష్‌ గుర్తుచేశారు. అయితే ఎస్‌ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది సర్కారు. కరోనా వ్యాక్సినేషన్‌ సన్నద్ధతలో అధికార యంత్రాంగం ఉన్నందున ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్నది ప్రభుత్వ వాదన. అందుకే ఎస్‌ఈసీ షెడ్యూల్‌ను నిలువరించాలని కోరుతూ సుప్రీంకు వెళ్లే యోచనలోఉంది.

అంతకుముందు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం SEC నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కలిసింది. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఎస్‌ఈసీని కలిశారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సిన అవసరాన్ని CSకు వివరించారు SEC. ఆర్థిక సంఘం నిధులు రావాలంటే సకాలంలో ఎన్నికలు జరగాలని.. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సూచించారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు ఉన్న ఇబ్బందులను SECకి వివరించారు సీఎస్‌ . కరోనా వ్యాప్తి, కొత్త వైరస్‌ కేసులపై నివేదిక సమర్పించారు. ఫిబ్రవరిలో ఎన్నికలకు సన్నద్ధం కాలేమని.. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు. ఎన్నికలను మరికొన్నాళ్లు వాయిదా వేయాలని అధికారులు బృందం ఎస్‌ఈసీని కోరింది. అయితే ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపిన SEC ఈ సమావేశం తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story