ఏపీలో మూడోదశ పంచాయతీ పోరు

ఏపీలో మూడోదశ పంచాయతీ పోరు
ఆ ప్రాంతాల్లో ఏకగ్రీవాలు, ఎన్నికల నిర్వహణ తీరుపై అటు రిటర్నింగ్‌ అధికారులు, ఇటు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ మూడో విడత ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందు కోసం సర్వం సిద్ధం చేశారు. మొత్తం 13 జిల్లాల్లోని 20 డివిజన్లలో 160 మండలాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఉదయం ఆరున్నరకు మొదలైన పోలింగ్‌.. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ముగుస్తుంది. మూడో విడత ఎన్నికల్లో ఇప్పటికే 579 పంచాయతీలు, 11 వేలా 732 వార్డులు ఏకగ్రీవమవ్వగా.. మిగతా 2 వేలా 639 పంచాయతీలు, 19 వేల 607 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 26 వేలా 851 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరగనుంది. ఇందులో 4 వేలా118 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు, 3 వేలా 127 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 1,977 నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లకు అదనపు భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్‌ అనంతరం సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 55 లక్షలా 75 వేలా 004 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

విశాఖ, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో సర్పంచ్‌ స్థానాలకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. వార్డు మెంబర్లు 210 స్థానాలకు ఒక్క నామినేషన్‌ కూడా పడలేదు. గుంటూరు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్‌లో మూడో విడత పోలింగ్‌ జరగనుంది. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని మొత్తం 132 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా.. వాటిలో 98 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 34 గ్రామాల్లో పోలింగ్‌ ఇవాళ జరగనుంది. ఈ ప్రాంతాల్లో ఏకగ్రీవాలు, ఎన్నికల నిర్వహణ తీరుపై రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అటు రిటర్నింగ్‌ అధికారులు, ఇటు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

విజయనగరం డివిజన్‌లోని 9 మండలాల్లో మూడు విడత పంచాయతీ పోలింగ్‌ జరగనుంది. 3 నియోజకవర్గాల్లో 9 మండలాలోని 248 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 37 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన స్థానాలకు ఈరోజు పోలింగ్‌ జరగనుంది. 2,030 పోలింగ్‌ బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 3 నియోజకవర్గాల్లోని 9 మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. 293 పంచాయతీలకు పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. వాటిలో 45 గ్రామాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 248 గ్రామాల్లో పోటీ జరగనుంది. మొత్తం 2 వేల 671 పోలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతపూడి సర్కిల్‌ పరిధిలో 71 పంచాయతీలకు పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. 10 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 61 పంచాయతీల్లో ఎన్నికల కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో కూడా ఇవాళే ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు. తన నియోజనర్గంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని.. ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎన్నడూలేని విధంగా కుప్పంలోని పంచాయతీల్లో అలజడి రేకెత్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లేఖలో తెలిపారు. కొన్ని పంచాయతీల్లో భద్రత పటిష్టం చేయాలని... మరికొన్ని మండలాల్లో ప్రత్యేక భద్రత, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలని లేఖ ద్వారా ఎస్ఈసీని చంద్రబాబు కోరారు.


Tags

Read MoreRead Less
Next Story