మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. విశాఖ మినహా త్వరగానే రానున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫలితాలు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. విశాఖ మినహా త్వరగానే రానున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫలితాలు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరో గంటలో తొలి ఫలితం రాబోతోంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు.. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరో గంటలో తొలి ఫలితం రాబోతోంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు.. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను 25 చొప్పున కట్టలుగా కట్టి ఒక్కో టేబుల్‌కు చేర్చారు. ఒక్కో టేబుల్‌లో వేయి ఓట్లను లెక్కిస్తుండడంతో.. మరో గంట గంటన్నరలో మొదటి ఫలితం రానుంది. ఒక్క విశాఖ మినహా మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫలితాలు త్వరగానే వస్తాయి.

విశాఖ కార్పొరేషన్ పూర్తి ఫలితాలు రావడానికి కనీసం సాయంత్రం ఆరు దాటుతుందని అంచనా వేస్తున్నారు. విశాఖలో డివిజన్ల సంఖ్య ఎక్కువ ఉండడం, గదులు కూడా చిన్నగా ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపును రాత్రి 8 గంటల్లోగా పూర్తిచేయాలని ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల కారణంగా ఏలూరులో ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

ఒక డివిజన్ ఓట్లను లెక్కించాక.. రెండో డివిజన్ లేదా వార్డుల ఓట్లను లెక్కిస్తున్నారు. అయితే, విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో టేబుళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒకేసారి రెండు, మూడు డివిజన్ల ఓట్లను లెక్కపెడుతున్నారు. కౌంటింగ్ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. లెక్కింపు కేంద్రాల్లో 144 సెక్షన్‌ అమలవుతోంది.కౌంటింగ్ సెంటర్లు, బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలలో విద్యుత్తు సరఫరా నిరంతరాయంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు.

ప్రత్యామ్నాయంగా జనరేటర్లు కూడా సిద్ధంగా ఉంచారు. కౌంటింగ్‌ ప్రక్రియను వీడియో తీస్తున్నారు. గెలిచిన, ఓడిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా పదిలోపు ఉంటే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తామని కలెక్టర్లు తెలిపారు. సింగిల్ డిజిట్‌ మెజారిటీతో సంబంధం లేకుండా అభ్యర్థులు రీకౌంటింగ్‌ కోరితే.. రిటర్నింగ్‌ అధికారులు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story