మూడో దశలోనూ ఢీ అంటే ఢీ.. 40 శాతం పంచాయతీల్లో టీడీపీ జోరు

మూడో దశలోనూ ఢీ అంటే ఢీ.. 40 శాతం పంచాయతీల్లో టీడీపీ జోరు
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది.. మూడో విడతలోనూ టీడీపీ జోరు చూపించింది.

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది.. మూడో విడతలోనూ టీడీపీ జోరు చూపించింది.. రెండు విడతల్లో ప్రకటించినట్లుగానే మూడో విడతలోనూ తాము మద్దతిచ్చిన అభ్యర్థులు ఎంతమంది గెలిచారో పక్కా లెక్కలేసి మరీ ప్రకటించింది.. మూడో దశలో 40 శాతానికిపైగా గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించినట్లుగా ఆ పార్టీ తెలిపింది.. రాత్రి 10.30 గంటల సమయానికి టీడీపీ విడుదల చేసిన ఫలితాల్లో వైసీపీ మద్దతుదారులు 983 గ్రామ పంచాయతీల్లో గెలుపొందగా, తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు 702 మంది విజయం సాధించినట్లుగా ప్రకటించింది. ఇక జనసేన-బీజేపీ కూటమి ఆరు చోట్ల, ఇతరులు 62 చోట్ల గెలిచినట్లుగా పేర్కొంది.

జిల్లాల వారీగా టీడీపీ గెలిచిన అభ్యర్థుల లిస్ట్‌ను వెల్లడించింది.. శ్రీకాకుళం జిల్లాలో 86 చోట్ల టీడీపీ, 90 స్థానాల్లో వైసీపీ గెలిచినట్లుగా తెలిపింది. విజయనగరం జిల్లాలో టీడీపీ 68 చోట్ల, వైసీపీ 57 చోట్ల గెలిచినట్లుగా వెల్లడించింది. విశాఖలో 89 చోట్ల టీడీపీ, 106 చోట్ల వైసీపీ గెలిచించింది.. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ 69 సర్పంచ్‌లు, వైసీపీ 84 సర్పంచ్‌లు గెలుచుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఖాతాలోకి 30 సర్పంచ్‌లు, వైసీపీ ఖాతాలోకి 57 పంచాయతీలు వెళ్లాయి. కృష్ణాలో టీడీపీ 64, వైసీపీ 48 పంచాయతీలు గెలుచుకున్నాయి. గుంటూరులో టీడీపీ ఐదు, వైసీపీ 10 పంచాయతీల్లో విజయం సాధించగా.. ప్రకాశంలో టీడీపీ 32 చోట్ల విజయం సాధించింది. నెల్లూరులో 59 స్థానాల్లో, కడపలో 23, కర్నూలు 49, అనంతపురం 82, చిత్తూరులో 47 పంచాయతీలను కైవసం చేసుకున్నట్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు.

మొత్తంగా ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల్లో పలుచోట్ల టీడీపీ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు. అయితే, గెలుపుపై టీడీపీ తప్పుడు లెక్కలు చెబుతోందంటూ అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో మూడోవిడతలో విజయాలపై మరింత స్పష్టత ఇచ్చింది టీడీపీ.. గెలుచుకున్న పంచాయతీలు, విజయం సాధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచిన నేపథ్యంలో.. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. బాణాసంచా పేల్చి టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ నేతలు వర్ల రామయ్య, పట్టాభి రామ్, టీడీ జనార్ధన్, మర్రెడ్డి, కార్యకర్తలు సంబరాల్లో పాల్గొన్నారు.

వైసీపీ అరాచక పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడుతున్నారని టీడీపీ నేతలు అన్నారు. 3వ విడత ఎన్నికల్లోనూ రాక్షస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కుప్పంలో కనిపించిన ప్రతిఒక్కరికి 10వేలు పంచారని.. డబ్బు ఎక్కువై మంత్రి పెద్దిరెడ్డి ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. నాలుగో విడతలోనూ ప్రజలు అధికార పార్టీ పోకడలకు బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు జోస్యం చెప్పారు.

ఇక మూడోదశ పంచాయతీ ఎన్నికల్లో 80.64 శాతం పోలింగ్‌ నమోదైంది.. తొలి రెండు దశలతో పోలిస్తే మూడో దశలో తక్కువగా పోలింగ్‌ నమోదైంది.. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 87.09 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. విశాఖలో అత్యల్పంగా 69.28 శాతం పోలింగ్‌ నమోదైంది.. మొత్తం 10 జిల్లాల్లో 80 శాతానికిపైగా ఓటింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది..

Tags

Read MoreRead Less
Next Story