పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న ఎస్‌ఈసీ

పంచాయతీ ఎన్నికలు  నిర్వహించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న ఎస్‌ఈసీ
ఎన్నికల్లో అలజడి సృష్టిస్తే.. షాడో టీమ్‌లతో పర్యవేక్షిస్తామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు.

పంచాయతీ ఎన్నికలు పక్కాగా నిర్వహించేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అధికారుల్లో అలసత్వం కనిపించినా, తన విధులకు అడ్డంకులు సృష్టించినా.. ఎక్కడా ఉపేక్షించడం లేదు. ఇందులో భాగంగానే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ గవర్నర్‍ బిశ్వభూషణ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లేఖ రాశారు.

ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‍పై సజ్జల చేస్తున్న విమర్శలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా లక్ష్మణ రేఖ దాటారని, దీనిపై కోర్టుకు వెళ్లనున్నామని, అయితే ఈ విషయాన్ని ముందుగానే తమ దృష్టికి తీసుకొస్తున్నామని గవర్నర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

అటు.. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశించారు. దీనిపై సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా ఆదేశాలివ్వాలన్నారు. సకాలంలో చర్యలు తీసుకోవడంలో ప్రవీణ్‌ విఫలమయ్యారని ఎస్‌ఈసీ తెలిపారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్‌ తన ఆదేశాలను పట్టించుకోలేదన్నారు నిమ్మగడ్డ. అధికారులను సన్నద్ధం చేయడంలో విఫలమయ్యారని, అందుకే ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని ఎస్‌ఈసీ తెలిపారు. ఇక ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కన్నబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కొన్ని రోజుల క్రితమే ఉత్తర్వులు ఇచ్చారు.

మరోవైపు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌వోసీలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలు తొలగించాలని, ధ్రువీకరణ పత్రాల జారీలో వివక్ష, జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు లేఖ రాశారు.

మరోవైపు అనంతపురం జిల్లాలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పర్యటించారు. ఏకగ్రీవాలు దురుద్దేశపూర్వకంగా జరుగుతున్నాయని, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఏకగ్రీవాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఏమీ లేవని, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వస్తున్నవేనని తెలిపారు. ఎన్నికల్లో అలజడి సృష్టిస్తే షాడో టీమ్‌లతో పర్యవేక్షిస్తామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు.

కర్నూలులోనూ పర్యటించారు నిమ్మగడ్డ. ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్న నిమ్మగడ్డ.. త్వరలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story