AP theatre Issue: ఏపీలో ప్రభుత్వం వర్సెస్ థియేటర్ల యాజమాన్యం..

AP theatre Issue: ఏపీలో ప్రభుత్వం వర్సెస్ థియేటర్ల యాజమాన్యం..
AP theatre Issue: ఏపీలో థియేటర్ల యజమానులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నారు.

AP theatre Issue: ఏపీలో థియేటర్ల యజమానులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నారు. ఒక్కొక్కరుగా స్వచ్ఛందంగా సినిమా హాళ్లకు తాళాలు వేస్తున్నారు. ఐదు రూపాయల టికెట్‌ ధరతో థియేటర్లు నడపలేం అంటూ మూసేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఇవాళ సమావేశం అవాలని భావిస్తున్నారు.

మరోవైపు కోర్టులోనూ విచారణ జరుగుతుండడంతో.. వేచిచూసే ధోరణలో ఉన్నారు. ఇప్పటికే 55 థియేటర్ల గేట్లకు తాళాలు పడ్డాయి. థియేటర్ల దోపిడీని సాగనివ్వబోం అంటున్న మంత్రులు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజల క్షేమమే ముఖ్యమైతే పెట్రోల్ ధరలు తగ్గించాలి కదా అని థియేటర్ యాజమాన్యాలు నిలదీస్తున్నాయి.

వినోదం అనేది ఒక ఆప్షన్ మాత్రమే. అవసరాలు తీరాక డబ్బులుంటే సినిమాకు వెళ్తారు. అలాంటిది.. సినిమా టికెట్ల ధరలు తగ్గించడం వల్ల ప్రజలకు మేలు చేకూరుస్తున్నామని మంత్రులు ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రజల క్షేమం అంటే విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు తగ్గించడం అని, సినిమా టికెట్ల ధరలు తగ్గించడం కాదని మంత్రులకు పాఠాలు చెబుతున్నారు.

అసలే కరోనా కారణంగా రెండేళ్ల నుంచి థియేటర్ యజమానులు చితికిపోయారు. వారిపై ప్రభుత్వం ప్రత్యేకంగా కరుణ చూపించింది కూడా ఏమీ లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని సంతోషించే లోపే టికెట్ ధరలు తగ్గించి తమ నెత్తిన పిడుగు వేశారంటూ వాపోతున్నారు. థియేటర్లు తెరిచి ఆర్థిక భారాన్ని మోయలేం అంటున్న యాజమాన్యాలు గేట్లకు తాళాలు వేస్తున్నాయి.

తూర్పు గోదావరి, అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో థియేటర్లు వరుసగా మూతపడుతున్నాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 45 థియేటర్లను మూతపడ్డాయి. అనంతపురం జిల్లా పెనుకొండ, కృష్ణా జిల్లా నందిగామ, మైలవరం, పెనుగంచిప్రోలు, శ్రీకాకుళం జిల్లా కొత్తూర్లలో తమ థియేటర్లకు యజమానులే స్వయంగా తాళాలు వేసుకున్నారు.

రాజమహేంద్రవరం గ్రామీణంలోని నామవరం, ధవళేశ్వరం, కాకినాడ రూరల్‌లోని వాకలపూడి, జగ్గంపేట, రావులపాలెం, గోకవరం, అమలాపురం, రాయవరం, మలికిపురం, సీతానగరం, రాజోలు, కోరుకొండ, ఉప్పాడ, ముమ్మిడివరం, గొల్లప్రోలులో సినిమా హాళ్లను యజమానులు మూసేస్తున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం 3 నెలల కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, ముందు దాని సంగతి చూడకుండా టికెట్ ధరలు తగ్గించడమేంటని మండిపడుతున్నారు.

టికెట్ ధరలు తగ్గించడంతో సరిపెట్టకుండా ఇన్నాళ్లూ లేనిది తనిఖీల పేరుతో తమను బెదిరిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఎన్నడూ లేనిది ఉన్నట్టుండి ఈ తనిఖీలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సినిమా హాల్ వల్ల దాదాపు 50 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ లెక్కన వందల లెక్కన థియేటర్లు మూతపడితే వేల మంది రోడ్డున పడాల్సి వస్తుంది. కనీసం ప్రభుత్వం ఈ దిశగానైనా ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నిస్తున్నారు

Tags

Read MoreRead Less
Next Story