మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై ఏపీఎస్‌ఈసీ ఏర్పాట్లు ముమ్మరం

మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై ఏపీఎస్‌ఈసీ ఏర్పాట్లు ముమ్మరం
మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేసింది SEC. ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేసింది SEC. ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో శనివారం తొలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎన్నికల నిబంధనలు వివరించారు.

మున్సిపల్ ఎన్నికల్లోనూ వాలంటీర్ల వినియోగం ఉండదని స్పష్టంచేశారు. ఎన్నికల వరకు వాలంటీర్ల కదలికలపై దృష్టి పెడతామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఐదుగురికి మించి పాల్గొనకూడదని తెలిపారు. ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతామని అన్నారు. కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఎస్‌ఈసీ ఆదేశించారు.

అధికారులతో సమీక్ష తర్వాత... రాజకీయ నేతలతో ఎస్‌ఈసీ సమావేశం నిర్వహించారు. పురపాలక, నగరపాలక ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాలంటూ వైసీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని పలువురు టీడీపీ నేతలు ఎస్‌ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. బెదిరింపులు ఎదుర్కొనే అభ్యర్థులకు భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎవరైనా అడ్డుకోవడం వల్ల నామినేషన్లు వేయలేదని ఆధారాలను చూపిస్తే..... పునఃపరిశీలిస్తామని తెలిపారు. మార్చి 1న అన్ని రాజకీయ పార్టీల నేతల ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు.

ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తెలిపారు. చెక్ పోస్టుల వద్ద పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. పోలింగ్‌ స్టేషన్‌కు వందమీటర్ల దూరంలో ప్రచారం చేయకూడదని తెలిపారు.

తొలి సమావేశం తిరుపతిలో నిర్వహించిన ఎస్‌ఈసీ... ఇవాళ విజయవాడలోని తన కార్యాలయంలో రెండో రోజు సమీక్ష కొనసాగించనున్నారు. మధ్యాహ్నం జరిగే సమావేశంలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులు పాల్గొననున్నారు. సాయంత్రం నాలుగు జిల్లాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అవుతారు. మార్చి 1న విశాఖపట్నంలో మూడో సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. ఆ సమావేశంలో... తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో సమావేశమవుతారు.

Tags

Read MoreRead Less
Next Story