APSRTC: సంక్రాంతి వేళ ప్రజలపై అధిక భారం.. రేట్లు పెంచేసిన ఏపీఎస్‌ఆర్‌టీసీ..

APSRTC (tv5news.in)

APSRTC (tv5news.in)

APSRTC: సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.

APSRTC: సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రైవేట్‌ ట్రావె ల్స్‌ నిర్వాహకులు చార్జీల మోత మోగిస్తున్నారు. టికెట్ల ధరలను ఒకేసారి మూడు రెట్లు పెంచి విక్రయిస్తున్నారు. మామూలు రోజుల్లో 450 నుంచి 5వందలు ఉండే టికెట్‌ ఇప్పుడు అమాంతం 12వందలకు పెంచేశారు. దీంతో నలుగురైదుగురు సభ్యులున్న కుటుంబం సొంతూరికి ప్రైవేటు బస్సులో వెళ్లాలంటే ఛార్జీలకే జేబులు ఖాళీ కానున్నాయి.

ఈ నెల 8 నుంచి పాఠశాలలకు సెలవులు కావడంతో బస్సుల్లో రద్దీ మొదలుకానుంది. ఇక ఈనెల 12, 13 తేదీల్లో బస్సుల్లో అత్యధిక రద్దీ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులంతా ఈ తేదీల్లోనే సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో బస్సులు, రైళ్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఇదే అదునుగా ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలను ఇష్టారాజ్యంగా పెంచేశారు.

ఈ నెల 12, 13 తేదీల్లో విజయవాడ నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే బస్సుల్లో ఛార్జీల మోత ఎక్కువగా ఉంది. ట్రావెల్స్‌ను బట్టి నాన్‌ ఏసీ బస్సుల్లో ఒక్కో బెర్త్‌ 9వందల నుంచి 12 వందల వరకు వసూలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఏసీ స్లీపర్‌ బస్సుల్లో 13 వందల నుంచి 16 వందల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ఏసీ బస్సుల్లో 2 వేల రూపాయలు కూడా డిమాండ్‌ చేస్తున్నాయి.

కడప, తిరుపతి మార్గంలో వెళ్లే బస్సుల్లో సైతం ఆర్టీసీ కంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు ఏపీఎస్‌ ఆర్టీసీ రెగ్యులర్‌ బస్సులు కాకుండా, అదనంగా నడిపే.. సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో 50 శాతం ఛార్జీ ఎక్కువగా తీసుకోనుంది. ప్రైవేటు ట్రావెల్స్‌లో రెగ్యులర్‌, స్పెషల్‌ బస్సులు అనే తేడా లేకుండా అన్నింటిలోనూ ఛార్జీలు పెంచేశారు.

ఇక ఇప్పటికే సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో అన్ని రైళ్లలో బెర్తులు, సీట్లు నిండిపోయాయి. పలు రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ పరిధిని దాటేయడంతో రిగ్రెట్‌ చూపిస్తున్నాయి. విజయవాడ నుంచి విశాఖ, శ్రీకాకుళం రోడ్‌ వెళ్లే రైళ్లలో రద్దీ అధికంగా ఉంది. 12, 13 తేదీల్లో ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్‌, ఏపీ ఎక్స్‌ప్రెస్‌, గోదావరి, విశాఖ, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ల్లోని స్లీపర్‌ క్లాస్‌ రిగ్రెట్‌ చూపుతోంది. సంక్రాంతికి వెళ్లేటప్పుడే కాదు.. తిరిగొచ్చేటప్పుడు కూడా ప్రయాణానికి కష్టం తప్పదు.. పండగకు వెళ్లినవారు ఎక్కువగా 16, 17 తేదీల్లో తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో ఆయా రోజుల్లో రైళ్లు, బస్సులు ఇప్పటికే నిండిపోయాయి.

Tags

Read MoreRead Less
Next Story