ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ పల్లకి మోసేదెవరు?

ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ పల్లకి మోసేదెవరు?
ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ పల్లకి మోసేదెవరు? రథసారథి లేక టీడీపీ రథం గాడి తప్పుతోందా? పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.

ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ పల్లకి మోసేదెవరు? రథసారథి లేక టీడీపీ రథం గాడి తప్పుతోందా? పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... గూటూరు కన్నబాబు, బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడు పేర్లను పరిశీలించారా? వీరిలో ఒకరికి త్వరలో ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించనున్నారా? మరి వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురిలో పార్టీ టిక్కెట్ దక్కేది ఎవరికి? పార్టీ టికెట్ విషయంలోనే నాయకులు ఇన్ ఛార్జ్ పదవి తీసుకోడానికి డైలమాలో పడ్డారా? ఒకప్పుడు టీడీపీకి కంచుకోటయిన ఆత్మకూరులో ప్రస్తుతం ఎందుకీ పరిస్థితి?

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఇక్కడి నాయకులు పార్టీలు మారినా క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు. కానీ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడే సరికి పరిస్థితులు మారుతున్నాయంటున్నారు స్థానిక టీడీపీ నాయకులు. ఈ నియోజకవర్గ టీడీపీ నాయకులకు ఒకరికి ఇన్ ఛార్జి పదవిని కట్టబెడితే... మరొకరికి పార్టీ టికెట్ కేటాయించేవారు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన గూడూరు మురళీ కన్నబాబుని కాదని... 2018లో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. కానీ చివరి క్షణంలో ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరడంతో... పార్టీ బాధ్యతలు కన్నబాబు చేపట్టారు.

చివరి వరకు టిక్కెట్ కన్నబాబుకే ఇస్తారంటూ పార్టీలో జోరుగా చర్చ జరిగింది. కానీ అధిష్టానం కృష్ణమనాయుడిని తెరపైకి తీసుకురావడంతో కన్నబాబుకు నిరాశ తప్పలేదు. దీంతో పార్టీలోని కార్యకర్తలు అస్తవ్యస్తం అయ్యే పరిస్థితి వచ్చింది. 2019లో టీడీపీ అభ్యర్థిగా నిలిచిన కృష్ణమ నాయుడు... అప్పుడు వైసీపీ హవాను తట్టుకుని నిలబడలేకపోయారు. వైసీపీ అభ్యర్థిగా నిలిచిన మేకపాటి గౌతం రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుందర రామిరెడ్డి తనయుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో... ఆయనను తాత్కాలిక ఇన్ ఛార్జ్ గా నియమించారు.

ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి... రెండున్నర ఏళ్లుగా గడిచినా నియోజకవర్గంలో కనీసం పది శాతం‌ గ్రామాలైనా పర్యటించలేదని వైసీపీ శ్రేణులే గుసగుసలాడుతున్నాయి. ఇక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో అమాత్యుల తీరుతో వైసీపీలో విభేదాలు కూడా భగ్గుమన్నట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీలో రగులుతున్న అసమ్మతి సెగను తమ పార్టీ క్యాష్ చేసుకోలేకపోతేందంటున్నాయి టీడీపీ శ్రేణులు. దీనికి కారణం టీడీపీలో బలమైన నాయకులు లేకపోవడమేనట. అందుకే నియోజకవర్గంలో పార్టీ వెనుకంజలో ఉందనేది పార్టీ క్యాడర్ మాట.

ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసి, మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేయకపోవడంతో క్యాడర్ డీలా పడినట్లు టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో... పార్టీని నమ్ముకొని పోటీచేస్తే... జిల్లాలో ఎక్కడా లేని విధంగా రెండు వార్డు కౌన్సిలర్లు గెలుపొందారు. అదే నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఉంటే... పార్టీ మరింత పుంజుకుంటుందంటోంది క్యాడర్. పార్టీ అధిష్ఠానం కూడా దీనిపై ఫోకస్ పెట్టింది. త్వరలో నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఎవరో ఒకరిని నియమిస్తారనే టాక్ ఉంది. కానీ ఇన్ ఛార్జ్ పదవి కోసం ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదట. ఇన్ ఛార్జికే వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ ఇస్తారని భరోసా ఇవ్వకపోవడంతోనే బాధ్యతలు తీసుకోడానికి ముందుకు రావడం లేదనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు నియోజకవర్గంలో వర్గ పోరు కూడా ఎక్కువైనట్లు ప్రచారం జరుగుతోంది. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఓ సామాజిక వర్గానికి చెందిన నేతయితే... గూడూరు మురళీ కన్నబాబు, కొమ్మి లక్ష్మయ్య నాయుడు... వీరిద్దరూ మరో సామాజిక వర్గానికి చెందిన నాయకులు. దీంతో వర్గ పోరు తీవ్రంగా కొనసాగుతున్నట్లు పార్టీలోనే చర్చ నడుస్తోంది. ఇటీవల నిర్వహించిన కొన్ని కార్యక్రమాలకు... ఓ వర్గం ఒకరోజు హాజరైతే... మరోవర్గం ఇంకో రోజు వెళ్తుండడంతో విభేదాలు బట్టబయలు అవుతున్నాయంటారు. వీరందరినీ ఒకే తాటిపై తీసుకువచ్చే సత్తా కలిగిన నాయకుడు రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు..

మొత్తంగా ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేత చేయాలంటే... శక్తివంచన లేకుండా పార్టీ కోసం శ్రమించిన వారికే ఇన్ ఛార్జి పదవి కట్టబెడితేనే సాధ్యమవుతుందంటున్నారు. అలాంటి నాయకులకే టికెట్ ఇస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నది కార్యకర్తల భావన. అధిష్టానం ఈ ముగ్గురిలో ఒకరికి ఇన్ ఛార్జ్ పదవిని కట్టబెట్టి వారికే టికెట్ ఇస్తుందా లేక ఎప్పటిలాగే చివర్లో తెరపైకి కొత్త వ్యక్తిని తీసుకొస్తారా అనేదానిపై పార్టీలో చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story