Vijayasai Reddy : వైసీపీలో విజయసాయిరెడ్డికి పూర్తిగా తగ్గిపోయిన ప్రాధాన్యత..!

Vijayasai Reddy :  వైసీపీలో విజయసాయిరెడ్డికి పూర్తిగా తగ్గిపోయిన ప్రాధాన్యత..!
Vijayasai Reddy : వైసీపీలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత మరింత తగ్గినట్టే కనిపిస్తోంది.

Vijayasai Reddy : వైసీపీలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత మరింత తగ్గినట్టే కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో 3 ఏళ్లుగా ఆయన సాగిస్తున్న పెత్తనంపైన, అరాచకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో.. దిద్దుబాటు దిశగానే జగన్‌ ఆయన్ను పూర్తిగా పక్కకుపెట్టినట్టుగా చెప్తున్నారు. ఇకపై విశాఖ బాధ్యతలన్నీ సమన్వయకర్తగా YV సుబ్బారెడ్డి చూస్తారు. ఉత్తరాంధ్ర నుంచి సాయిరెడ్డిని తప్పించి YCP అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల్ని అప్పగించారు.

విశాఖలో 3 ఏళ్లలో విజయసాయిరెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో చాలా డ్యామేజ్‌ జరిగింది. ఎమ్మెల్యేలు, ఇతర నేతల నుంచి వరుస ఫిర్యాదులు కూడా వెల్లువెత్తినా మొదట్లో చూసీచూడనట్టే వదిలేశారు. ఇప్పుడు ప్రజల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చివరికి ఆయన అధికారాలన్నింటికీ కత్తెర వేసి.. అనుబంధ విభాగాలకే పరిమితం చేశారు.

గతంలో విశాఖపట్నం బాధ్యతల్ని YV సుబ్బారెడ్డే చూసేవారు. 2016 నుంచి ఆ ప్రాంతంలో తీసుకునే నిర్ణయాలూ ఆయన పర్యవేక్షణలోనే జరిగేవి. కొత్త నేతల్ని చేర్చుకోవడం, పార్టీ బలోపేతం లాంటి కార్యాచరణ అంతా YVనే చూసేవారు. అందుకే.. తిరిగి ఆయన్నే సమన్వయకర్తగా నియమించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అంతర్గత సమస్యల్ని పరిష్కరించడంపై ప్రధాన దృష్టి పెడుతూ.. పార్టీని బలోపేతం చేయడం టార్గెట్‌గా ఇప్పుడు YV సుబ్బారెడ్డి అడుగులు వేయాల్సి ఉంటుంది.

ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా విశాఖ అని ప్రకటించినా కూడా YCPకి మైలేజ్ రాలేదంటే దానికి కారణం సాయిరెడ్డే అనే ఫీలింగ్‌ కూడా పార్టీ వర్గాల్లో ఉన్న నేపథ్యంలో. ఆయన్ను తప్పించి సుబ్బారెడ్డిని తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది.ఇప్పుడు విశాఖ జిల్లాకు మాజీ మంత్రి అవంతిని అధ్యక్షుడిగా నియమించారు. ఎన్నికలకు ముందు YCPలో చేరిన ఆయన గెలిచాకా మంత్రి అయ్యారు. ఇప్పుడు జిల్లా బాధ్యతలు చూస్తున్నారు.

అలాగే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కరణం ధర్మశ్రీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బాధ్యతలు కె.భాగ్యలక్ష్మికి అప్పగించారు. వీరందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు YV సుబ్బారెడ్డిపై పడింది.

Tags

Read MoreRead Less
Next Story