ఉత్తరాంధ్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి విస్మరించారు- చంద్రబాబు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి విస్మరించారు- చంద్రబాబు
Chandra Babu: ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపినా, టీడీపీ నేతల్ని అక్రమంగా అరెస్ట్‌ చేయడం దారుణమంటూ చంద్రబాబు మండిపడ్డారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపినా, టీడీపీ నేతల్ని అక్రమంగా అరెస్ట్‌ చేయడం దారుణమంటూ చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం సందర్భంగా తాజా పరిణామాలపై సమీక్ష జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించిన ఆయన.. టీడీపీ నిరసనలకు వచ్చిన ప్రజా మద్దతు చూసైనా ప్రభుత్వం పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై భవిష్యత్‌ ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. స్కామ్‌లకు అడ్డుకట్ట వేసినా, దుబారా ఖర్చులు తగ్గించినా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచాల్సిన అవసరం రాదని అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపైనా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అరాచక పాలన వల్ల రాష్ట్రానికి రావాల్సిన 10 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని, ఆర్థిక సంక్షోభానికి ఇది కూడా ఒక కారణమని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి విస్మరించారని ఫైరయ్యారు. విశాఖలో భూకబ్జాలు పెరిగిపోయి.. ప్రశాంతమైన విశాఖను అశాంతి నిలయంగా మార్చారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాలో ముఖ్యమంత్రి కార్యాలయానికి, కొందరు మంత్రులకు ప్రమేయం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయని అన్నారు. ఈ మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే ఉచిత ఇసుక విధానం తిరిగి తేవాలని బాబు డిమాండ్ చేశారు. మహిళల పొదుపును కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే విధానాలకు జగన్ తెరతీయబోతున్నారని, ఇది సరికాదని అన్నారు.

అటు, సమావేశంలో మంత్రి బొత్స తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ఆయన మాట్లాడిన తీరు సరికాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో 2 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిరర్థకం చేసి, రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story