వైసీపీకి ఓటమి తప్పదు.. భయపడకుండా నామినేషన్లు వేయండి : చంద్రబాబు

వైసీపీకి ఓటమి తప్పదు.. భయపడకుండా నామినేషన్లు వేయండి : చంద్రబాబు
డీజీపీపైనా హైకోర్టు వ్యాఖ్యలు, సీఎంపై జడ్జి రాకేష్ కుమార్ వ్యాఖ్యలు.. ఏపీలో వైసీపీ ఉన్మాద పాలనకు నిదర్శనమన్నారు చంద్రబాబ.

స్వేచ్ఛగా.. నిష్పాక్షికంగా పంచాయతీ ఎన్నికలు జరిగితే వైసీపీకి ఓటమి తప్పదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. వైసీపీ అరాచకాలను చూసి ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని.. వెనుకంజ వేయకుండా పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండి పోరాడాలన్నారు. అన్నిగ్రామాల్లో ధైర్యంగా, స్వేచ్ఛగా నామినేషన్లు వేయాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని, ధర్మాన్ని పరిరక్షించాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే వైసీపీకి.. పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలు జరగడకుండా చూడాలని.. హింస, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేయాలని చూసే వైసీపీకి బుద్ధి చెప్పాలని కోరారు. జగన్ రెడ్డి ఉన్మాదపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తు చేశారు.

పోటీకి కావాల్సిన కులధ్రువీకరణ పత్రం, నో డ్యూస్, నేటివిటి సర్టిఫికెట్లను అభ్యర్ధులంతా సిద్దం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆన్‌లైన్‌లో నో డ్యూస్ సర్టిఫికెట్లు పొందేలా వీలు కల్పించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఇప్పటికే వినతి పంపామన్నారు. తొలిరోజే సాధ్యమైనంత ఎక్కువగా అందరూ నామినేషన్లు వేయాలన్నారు. ఏవైనా సాంకేతిక అభ్యంతరాలు ఎదురైనా తర్వాత వాటిని పరిష్కరించుకోవచ్చని సూచించారు.

ఎక్కడ ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, వైసీపీ నాయకులు ఘర్షణలకు దిగినా ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలను సేకరించాలన్నారు. లిఖిత పూర్వక ఫిర్యాదులతో పాటు వాటిని రిటర్నింగ్ అధికారులకు అందించాలని.. పార్టీకి కూడా పంపాలన్నారు. దీనికోసం 24 గంటలు పనిచేసేలా టీడీపీ కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందని.. రాష్ట్ర ఎన్నికల సంఘంపై వైసీపీ దాడి గురించి దేశవ్యాప్త డిబేట్ జరిగిందన్నారు చంద్రబాబు. గతేడాది మార్చిలో స్థానిక ఎన్నికల్లో 25 శాతం బలవంతపు ఏకగ్రీవాలే ఉన్నాయని.. దాడులు, దౌర్జన్యాలతో భయోత్పాతం సృష్టించారని అన్నారు. ఏపీలో పరిస్థితులను సుప్రీం సైతం తప్పు పట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో చట్టరాహిత్యంపై సుప్రీం కోర్టు మండిపడినా రాష్ట్ర ప్రభుత్వం తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

డీజీపీపైనా హైకోర్టు వ్యాఖ్యలు, అంతకు ముందు సీఎం జగన్ రెడ్డిపై జడ్జి రాకేష్ కుమార్ వ్యాఖ్యలు.. ఏపీలో వైసీపీ ఉన్మాద పాలనకు నిదర్శనమన్నారు. అయినా వైసీపీ నాయకులు ఏమాత్రం సిగ్గుపడటం లేదని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story