సీబీఐ కేసుల్లో నిందితులతోనా టిటిడి కొత్త పాలక మండలి: చంద్రబాబు విమర్శలు

సీబీఐ కేసుల్లో నిందితులతోనా టిటిడి కొత్త పాలక మండలి: చంద్రబాబు విమర్శలు
పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరం అన్నారు. తిరుమలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఇదొక జంబో బోర్డ్ అంటూ విరుచుకుపడ్డారు. భక్తి భావంతో, స్వామి సేవలో తరించే వారికి బోర్డులో ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి.. సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు, అవినీతిపరులు, నేర చరిత్ర కలిగిన వారిని బోర్డులోకి తీసుకున్నారని ఆరోపించారు. వ్యాపార ధోరణిలో టీటీడీ జంబో బోర్డు ఏర్పాటు చేసి.. పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరం అన్నారు.

తిరుమలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చేశారని, జంబో బోర్డు ఏర్పాటులో స్వార్థ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు.

తిరుమల ప్రతిష్ఠత, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్‌ ప్రభుత్వ చర్యలు ఉన్నాయంటూ జగన్‌కు లేఖ రాశారు చంద్రబాబు. మరోవైపు సామాన్య భక్తుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లంతా ఏడాది పొడవునా దర్శనాలకు వస్తుంటే.. ఇక సామాన్యులు శ్రీవారిని అరక్షణమైనా చూడగలరా అని ప్రశ్నిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలిలో ఒక చైర్మన్‌, 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యులు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 31 మందితో బోర్డు ఏర్పాటు చేశారు. వీరికి అదనంగా మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది జగన్ ప్రభుత్వం. ఈ 50 మంది టీటీడీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం గానీ, తిరుమలకు పనికొచ్చేలా సలహాలు ఇవ్వడం గానీ చేయరు. చేసేదల్లా ప్రత్యేక ఆహ్వానితులు అన్న హోదాలో శ్రీవారిని దర్శనం చేసుకోవడమే.

తిరుమలలో దర్శనానికి వచ్చినప్పుడు వీరికి ప్రత్యేక మర్యాదలు చేస్తారు. పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్‌ను ప్రత్యేక ఆహ్వానితులకు వర్తింపజేయడంతో.. ఆ మర్యాదలతోనే శ్రీవారిని దర్శించుకుంటారు. పైగా ఈ ప్రత్యేక ఆహ్వానితులు.. తమకు నచ్చిన వారిని శ్రీవారి దర్శనానికి సిఫార్సు చేయవచ్చు. ఇలా చూస్తూ పోతే.. సామాన్య భక్తులు క్యూ లైన్లలో పడిగాపులు పడుతుంటారు... ప్రత్యేక ఆహ్వానితులు, వాళ్లు సిఫార్సు చేసిన వాళ్లు మాత్రం బ్రేక్‌ దర్శనంలో శ్రీవారిని దగ్గరగా, తొందరగా దర్శించుకుని వస్తారు. దీంతో మా సంగతేంటని సామాన్య భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ఒకప్పుడు రోజువారీ బ్రేక్‌ దర్శనాలు మహా అయితే 2500 మందికి ఉండేది. పండగలు, ప్రత్యేక రోజుల్లోనూ 3వేలు దాటేది కాదని రికార్డ్స్ చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఈ సంఖ్య 4 వేలు దాటింది. ప్రత్యేక ఆహ్వానితుల కారణంగా రోజువారీ బ్రేక్‌ దర్శనాల సంఖ్య 5వేలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే శ్రీవారి మొత్తం దర్శన సమయంలో కనీసం ఐదారు గంటలు కేవలం బ్రేక్‌ దర్శనాలకే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక ఆహ్వానితులు, వారి పరివారం కారణంగా శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చే సామాన్య భక్తులు ఐదారు గంటలకు పైగా క్యూలైన్లలోనే నిల్చోవాల్సి ఉంటుంది.

కేవలం దర్శనాల దగ్గరే కాదు.. వసతి విషయంలోనూ వీరికి ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది. కొండపై దిగిన వెంటనే గదులు కేటాయించాలి. వారికి ప్రత్యేక వాహనాలను, సిబ్బందిని ఇవ్వాలి. పైగా వీరితో పాటు ప్రత్యేక ఆహ్వానితులు సిఫార్సు చేసే వారు కూడా వస్తుంటారు. వీళ్లందరికీ గదులు, వాహనాలు, సిబ్బంది వంటి సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా టీటీడీకి ప్రత్యేక భారమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story