టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే.. వైసీపీ ప్రభుత్వం తీర్చుకున్న ప్రతీకారం ఇదా? : చంద్రబాబు

టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే.. వైసీపీ ప్రభుత్వం తీర్చుకున్న ప్రతీకారం ఇదా? : చంద్రబాబు
పంచాయతీ సెక్రెటరీ, పోలీసు అధికారులు దగ్గరుండి కూలగొట్టించడం దారుణమన్నారు చంద్రబాబు.

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారని ఓ వ్యక్తి ఇంటి ముందు ఉన్న డ్రైనేజీని, మెట్లను అధికారులు తొలగించారు. రొంపిచర్ల మండలం ఇస్సాపాలెం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు డ్రైనేజీ, మెట్లను తొలగించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. డబ్బులు అడిగితే ఇవ్వలేదని అన్యాయంగా తన ఇంటి ముందు మెట్లను అక్రమంగా కూల్చివేశారని చెబుతున్నారు. పంచాయతీ సెక్రెటరీ, పోలీసు అధికారులు దగ్గరుండి కూలగొట్టించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. మెట్లను కూలగొట్టద్దని క్రేన్‌కు అడ్డంగా పడుకున్నా అధికారులు పట్టించుకోలేదు.

ఈ ఘటనపై నరసరావుపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ చదలవాడ అరవందబాబు ఫైర్ అయ్యారు. అన్ని అనుమతులున్నా.. మెట్లను, డ్రైనేజీని కూల్చడం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికార దాహంతో అవినీతికి పాల్పడుతున్నారని.. ప్రతి పనికి ఓ రేటు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఇక ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించినందుకు వైసీపీ ప్రభుత్వం తీర్చుకున్న ప్రతీకారం ఇదంటూ మండిపడ్డారు. ప్రజలు..ప్రత్యర్ధిని గెలిపిస్తే పగబట్టి, వారి వ్యక్తిగత ఆస్తులను కూల్చుతారా అని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాన్ని రాజారెడ్డి రాజ్యాంగం నేర్పిందా అని మండిపడ్డారు చంద్రబాబు. పంచాయతీ సెక్రెటరీ, పోలీసు అధికారులు దగ్గరుండి కూలగొట్టించడం దారుణమన్నారు చంద్రబాబు.


Tags

Read MoreRead Less
Next Story