Chandrababu Meeting : అవినీతి, అరాచకం, అబద్ధాలలో తప్ప ప్రతి అంశంలోనూ జగన్‌ ఘోరంగా విఫలం..!

Chandrababu Meeting : అవినీతి, అరాచకం, అబద్ధాలలో  తప్ప ప్రతి అంశంలోనూ జగన్‌ ఘోరంగా విఫలం..!
టీడీపీ ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పరిణామాలు, వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..

టీడీపీ ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పరిణామాలు, వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. భవిష్యత్తు వ్యూహాలపై నేతలతో చర్చించారు. రెండున్నరేళ్లలో ఇంత అరాచకం, అప్రతిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదన్నారు చంద్రబాబు.. అవినీతి, అరాచకం, అబద్ధాలతో తప్ప ప్రతి అంశంలోనూ జగన్‌ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారన్నారు. మనం ఒక సైకో నుంచి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అయినప్పటికీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం అన్నీ భరిస్తున్నామని చెప్పారు.. కార్యకర్తలే టీడీపీకి బలమన్నారు.. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో పోలీసులు, వైసీపీ గూండాలతో వీరోచితంగా పోరాడుతూ జైలుకు కూడా వెళ్లి వస్తున్నారని గుర్తు చేశారు.

భవిష్యత్తు తరాల కోసం టీడీపీ శ్రేణులు చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు కొనియాడారు.. టీడీపీ అనేక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించిందని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి 2019 ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందిందన్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పే గోబెల్స్ ప్రచారం చేశారని.. ఇవాళ అన్ని విషయాలు ప్రజల నిజజీవితంలో అవగతం అవుతున్నాయని అన్నారు. జగన్ రెడ్డి మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారని.. బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.

ఉపాధి హామీ బిల్లుల బకాయిలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సృష్టించారని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.. 12శాతం వడ్డీతో కలిపి బిల్లులు ఇవ్వాలని న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుతోనైనా జగన్ రెడ్డి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో టీడీపీ చివరి వరకూ పోరాడి విజయం సాధించిందన్నారు చంద్రబాబు. టిడ్కో ఇళ్లను ఇంత వరకు లబ్దిదారులకు కేటాయించకుండా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల పంట పొలాల్లో బోర్లు వేసిన డబ్బులు కూడా ఇవ్వలేదని.. పైగా ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని ఫైరయ్యారు.

ఆదాయం కోసం ప్రభుత్వమే మద్యాన్ని బలవంతంగా తాగించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు చంద్రబాబు.. చివరకు ఆడబిడ్డల తాళిబొట్లతోనూ ఆడుకునే పరిస్థితికి వచ్చారంటూ ధ్వజమెత్తారు.. ఏపీని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారని ఫైరయ్యారు. డ్రగ్స్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.. అవినీతి డబ్బుతో రాజకీయం చేస్తున్నారని.. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.. వైసీపీ నేతల అవినీతిని బట్టబయలు చేస్తామని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్‌ రెడ్డి గెలిచే పరిస్థితి లేదన్నారు.

టీడీపీ హయాంలో నధుల అనుసంధానానికి కృషి చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్‌ను నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.. ఉత్తరాంధ్రను పూర్తిగా నాశనం చేశారని, విశాఖను భూకబ్జాలకు నిలయంగా మార్చారని ఫైరయ్యారు. అమరావతిని నాశనం చేయడం ద్వారా రెండు లక్షల కోట్ల ప్రభుత్వ సంపద నాశనమైందన్నారు. కొత్త సిటీల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తోందని.. ఆ నిధులను అమరావతి ఉంటే వినియోగించుకునే వాళ్లమన్నారు.. అమరావతి నాశనం వల్ల యువతకు ఉద్యోగాలు లభించడం లేదన్నారు.. వీటన్నిటిపై టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం.. ఇప్పుడు జగన్ రెడ్డి పాలనలో విధ్వంసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

అంతకు ముందు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నాయకులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులు, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story