Chandrababu: డ్రగ్స్ మాఫియా వ్యవహారాలపై లోతైన విచారణ జరిపించాలి: చంద్రబాబు

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్‌తో ఢిల్లీకెళ్లిన చంద్రబాబు తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Chandrababu: ఏపీలో శాంతి భద్రతలు క్షీణించిన నేపథ్యంలో ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్‌తో ఢిల్లీకెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు టీడీపీనేతలు, కార్యకర్తలు. పెద్ద సంఖ్య అక్కడి చేరుకున్న నేతలు.. భారీగా నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు.

సోమవారం రాష్ట్రపతిని కలిసి 8 పేజీల మెమోరాండంను అందజేచేశారు. దీంతోపాటు 323 పేజీల పుస్తకాన్ని ఇచ్చారు. ప్రధాని మోదీని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కూడా కలవాలనుకున్నారు. అయితే.. అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉండటంతో ఆయనతో భేటీ సాధ్యం కాలేదు. దీంతో మరోసారి ఆయన అపాయింట్‌మెంట్ ఇచ్చినప్పుడు కలవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఇచ్చిన మెమోరాండంలో ప్రధానంగా నాలుగు డిమాండ్లు చేశారు చంద్రబాబు. ఏపీలో గంజాయి, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలడమే కాకుండా పోలీసుల అండతో ప్రభుత్వమే రాజ్యహింసకు పాల్పడతున్నందున రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు టీడీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరపాలని కోరారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్ ను రీకాల్ చేయాలని, డ్రగ్స్ మాఫియా వ్యవహారాలపై లోతైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ మెమోరాండంను పరిశీలించిన రాష్ట్రపతి.. చంద్రబాబు లేవనెత్తిన అంశాలన్నీ చాలా సీరియస్ అంశాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన అంతట ఆయనే రాజధాని అమరావతి గురించి ఆరా తీశారు.

ఏపీలో అరాచక పాలనపై జాతీయ స్థాయిలో చైతన్యం తెచ్చేందుకు ఢిల్లీకి వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. గత రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఏపీ సర్వ నాశనమైందన్నారు. యువతను డ్రగ్స్‌కు బానిసలు చేస్తున్నారని, దీన్ని ఇలాగే కొనసాగనిస్తే ఏపీ అట్టడుగు స్థాయికి చేరుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే డ్రగ్స్ పై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరంఉందన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ ఎక్కడ పట్టుపడినా వాటి మూలాలు ఏపీ లో ఉంటున్నాయన్నారు.

అభివృద్ధి చేయకుండా నవరత్నాల పేరుతో వేలాది కోట్లు పంచడం వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు చంద్రబాబు. ప్రజలకు ఇచ్చే దానికన్నా వారి నుంచి వసూలు చేస్తున్నదే అధికంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా ఇప్పుడిప్పుడు గ్రహిస్తున్నారన్నారు. వైజాగ్ లో ఎయిడెడ్ స్కూళ్లను మూసివేయడంపై జరిగిన ధర్నాలో చిన్న పిల్లలు సైతం అమ్మ ఒడి వద్దు ..మా బడి ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.

హైదరాబాద్ కన్నా మరింత ఆదాయాన్ని ఇచ్చే అమరావతిని జగన్ చంపేయడం ఏపీకి ఒక శాపమన్నారు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులన్నింటినీ నిలిపి వేశారన్నారు. ఇప్పడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అయ్యిందన్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పడు వచ్చినా జగన్ ఓడిపోవడం ఖాయమని ప్రజలంతా ఆ సమయం కోసం వేచి చూస్తున్నారని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. మొత్తానికి... ఏపీలో అరాచకపాలనను.. జాతీయస్థాయికి తీసుకెళ్లడంలో సక్సెస్‌ సాధించారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story