5 కోట్లతో పూర్తి చేయాల్సిన భవనం కోసం 8 కోట్లు ఖర్చు చేశారని నివేదిక..

5 కోట్లతో పూర్తి చేయాల్సిన భవనం కోసం 8 కోట్లు ఖర్చు చేశారని నివేదిక..

ప్రజావేదిక కూల్చేయాలని సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ ఆదేశాలిచ్చారు. ఇవాళ రేపు జరిగే కలెక్టర్లు, ఎస్పీల సదస్సు ముగిసాక దీన్ని కూల్చేయాలని జగన్ అన్నారు. గత ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు సహా అన్నింటినీ బేఖాతరు చేస్తూ ఈ ప్రజావేదికను నిర్మించిందని.. ముఖ్యమంత్రి స్థాయిలోనే ఇలా చేయడం అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తే రూల్స్ అతిక్రమిస్తే.. ఇక వేరొకరి అక్రమ నిర్మాణాలపై ఎలా చర్యలు తీసుకోగలమన్నారు. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే.. ప్రజావేదిక కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. దీనికి అధికారులంతా మద్దతుపలికారు. హర్షధ్వానాలతో సీఎంకు అభినందనలు తెలిపారు.

ప్రస్తుతం ఉండవల్లిలో ఉన్న ఈ ప్రజావేదిక చంద్రబాబు నివాసానికి దగ్గరగా ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు వీలుగా దీన్ని కట్టారు. ఐతే.. జగన్ అధికారంలోకి రావడంతోనే ప్రజావేదిక విషయంలో ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రజావేదికను తమకు కేటాయించాలంటూ ఇప్పటికే చంద్రబాబు లేఖ రాసినా.. దాన్ని తోసిపుచ్చిన ప్రభుత్వం భవనం స్వాధీనం చేసుకుంది. ఇవాళ కలెక్టర్ల కాన్పరెన్స్ నిర్వహించారు జగన్. ఇదే మీటింగ్‌లో మంత్రులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల సాక్షిగా దీన్ని కూల్చేయమని ఆదేశాలిచ్చారు.

చంద్రబాబు నివాసంతోపాటు పక్కనే ఉన్న ప్రజావేదిక నిబంధనలకు విరుద్ధంగా కట్టారని వైసీపీ మొదటి నుంచి చెప్తూ వస్తోంది. నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నిర్మాణాల విషయంలో అన్ని రూల్స్ ఉల్లంఘన జరిగిందని వాదించింది. అటు, ప్రజావేదిక విషయంలో CRDA ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. 5 కోట్లతో పూర్తి చేయాల్సిన భవనం కోసం 8 కోట్లు ఖర్చు చేశారని ఆ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్.. చివరికి ప్రజావేదిక కూల్చేయాలనే నిర్ణయించారు.

ప్రస్తుతం ప్రతిపక్ష నేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ టైమ్‌లో ప్రజావేదిక స్వాధీనం చేసుకోవడం.. అందులో చంద్రబాబుకు సంబంధించిన వస్తువులన్నీ బయటపడేయడంపై ఇప్పటికే TDP ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ భవనం తమకు కేటాయించాలని కోరినా ఇవ్వకపోవడం రాజకీయ కుట్రేనని ఆరోపించింది. ఇక ఇప్పుడు ఏకంగా దీన్ని కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనమైంది. దీనిపై తెలుగుదేశం నేతల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి జగన్ తాను చేస్తున్న ప్రతి సమీక్షలోనూ, ప్రతి మీటింగ్‌లోనూ గత ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడిందని గట్టిగా చెప్తున్నారు. వాటన్నింటినీ తవ్వి తీస్తామని పదేపదే అంటున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజావేదికను నేలమట్టం చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది అని ఆలోచించడం కంటే.. ప్రభుత్వం ఎక్కడా అక్రమాలకు పాల్పడదు అనే మెసేజ్ ఇవ్వడమే ముఖ్యమని జగన్ నిర్ణయించుకున్నారు. మొత్తంమీద.. ప్రజావేదిక విషయంలో జగన్ నిర్ణయం.. దానికి టీడీపీ కౌంటర్ ఏంటనేది చర్చనీయాంశమైంది.

Tags

Read MoreRead Less
Next Story