ఏలూరు ఘటన : ఎలాంటి వైరస్‌ లేదని నిర్ధారణ

ఏలూరు ఘటన : ఎలాంటి వైరస్‌ లేదని నిర్ధారణ

ఏలూరు ఘటనకు కారణాలు తెలియరావడం లేదు. అటు.. అస్వస్థతకు గురైన బాధిత కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బాధితుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అయితే.. ఎలాంటి వైరస్‌ లేదని నిర్ధారించారు. 227 మంది ఈ లక్షణాల బారిన పడ్డారని ప్రభుత్వం తెలిపింది. 70 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. మరో 76 మంది మహిళలు, 46 మంది చిన్నపిల్లలు చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఐదుగురికి మాత్రం పదేపదే ఫిట్స్ వస్తున్నాయని వెల్లడించింది.

సెల్స్‌ సెన్సిటివిటీ టెస్ట్‌ కోసం శాంపిళ్లు పంపామని.. దీనికి ఐదు రోజుల సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. అది వస్తే గానీ అసలు విషయం తెలియదన్నారు. చాలా మంది భయపడే.. పడిపోతున్నారని వెల్లడించారు. బాధితులందరికీ అత్యవసర వైద్య సహాయం అందిస్తున్నామని.. అదనపు వైద్యుల్ని, సిబ్బందిని నియమించినట్లు వైద్య శాఖ వెల్లడించింది. నగరంలోని 62 సచివాలయాల పరిధిలో పూర్తిగా ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టామన్నారు. అత్యవసరమైతే బాధితులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

పంపుల చెరువు నుంచే ఈ ప్రాంతాలకు మంచినీటి సరఫరా అవుతుంది. కృష్ణా నీటిని చెరువులోకి మళ్లించి శుద్ధి చేసిన తర్వాత.. సరఫరా చేస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాలకు ఇక్కడి నుంచే మంచినీరు వెళుతుంది. అయితే.. నీటిపైనే స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వం నీటి సరఫరాలో ఎలాంటి కాలుష్యం లేదని అంటోంది. అటు.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాధితులను పరామర్శిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story