కరోనా సెకండ్‌ వేవ్‌ : ఏపీలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు..!

కరోనా సెకండ్‌ వేవ్‌ : ఏపీలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు..!
ఏపీలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 947 కేసులు వచ్చాయి.

ఏపీలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 947 కేసులు వచ్చాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 180, విశాఖపట్నం 156, గుంటూరు 145, కృష్ణా జిల్లాలో 113 కేసులు రాగా.. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 18 కేసులు వచ్చాయి. అయితే మరణాలు సంభవించలేదు. అటు.. శనివారం ఒక్క రోజే వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న 104 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏయూలో 30, శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో 10, కర్నూలు జిల్లాలోని ఐదు విద్యాసంస్థల్లో 7, తిరుపతి ప్రభుత్వ బాలుర హాస్టల్లో 7 కేసులు బయటపడ్డాయి. రాజమహేంద్రవరం పరిధిలో కొత్తగా 50 మందికి కరోనా వచ్చినట్లు తేలింది.

ఏయూలో గత రెండురోజుల్లో 83 మందికి కరోనా సోకింది. వీరందరినీ ఏయూ ఇంజినీరింగ్‌ విభాగంలోనే ఐసొలేషన్‌లో ఉంచినట్లు రిజిస్ట్రార్‌ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఏయూ హాస్టళ్లన్నింటినీ మూసేసి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నారు. రాజాంలో ఇద్దరు విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకువెళ్లగా.. మిగతా 8 మందికి అక్కడే చికిత్స అందిస్తున్నారు. కరోనా వచ్చినా.. చాలామంది విద్యార్థులకు లక్షణాలేవీ ఉండట్లేదు. ఇటీవల రాజమహేంద్రవరం పరిధిలో ఒకే ప్రైవేట్‌ విద్యాసంస్థలో 163 మందికి కరోనా సోకింది. అక్కడే శనివారం నిర్వహించిన పరీక్షల్లో మరో 50 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 213కు చేరింది. తొలుత కరోనా సోకిన విద్యార్థులకు ప్రైమరీ కాంటాక్టులుగా ఉన్నవారిని పరీక్షించగా ఈ రిపోర్టులు వచ్చాయి.

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలో ఇద్దరు, పరిగి మండలం సేవామందిరంలో ఒకరు చొప్పున ఉపాధ్యాయులూ కరోనా బారిన పడ్డారు. కడప జిల్లా డ్వామా కార్యాలయ సిబ్బందిలో 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లా గూడూరులో గత నాలుగు రోజులుగా కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గమళ్లపాలెం, తూర్పువీధి కృష్ణ మందిరం ప్రాంతాల్లో రెడ్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. ఇక.. మాస్కులు ధరించని కొందరికి గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిల్లో పోలీసులు 500 చొప్పున జరిమానాలు విధిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story