ఎవరికీ సీరియస్‌నెస్‌ లేదు.. అలా హెచ్చరించడంలో ఆంతర్యమేమిటి:చంద్రబాబు

ఎవరికీ సీరియస్‌నెస్‌ లేదు.. అలా హెచ్చరించడంలో ఆంతర్యమేమిటి:చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉగ్ర చంద్రుడిగా మారారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోను సహించబోనని హెచ్చరించారు. వైసీపీ శ్రేణుల ఘాతుకానికి బలైన వారి కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పారాయన. మృతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థికంగా సహాయం అందిస్తామంటున్నారు.

వైసీపీ దాడులతో ఆందోళన చెందుతున్న కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు. అధికారం కానీ.. ప్రతిపక్షం కానీ టీడీపీకి కొత్త కాదన్నారు. పార్టీ అధికారంలో లేదని కార్యకర్తలెవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారాయన. గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో తనను కలిసిన పెద్దనందిపాడు కార్యకర్తలతో చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడారు. టీడీపీకి 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, వారిని కాపాడుకునే బాధ్యత పార్టీదేనని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా టీడీపీని బలపరిచే సైన్యాన్ని తయారు చేయాలని నేతలకు సూచించారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు పోలీసులు భద్రత కల్పించాల్సిన అవసరముందన్నారు. టీడీపీకి నష్టం చేయాలని చూస్తే వారికే నష్టమని హెచ్చరించారు. వైసీపీ దాడుల్లో చనిపోయిన ఆరుగురి కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల లక్షల సాయం అందిస్తామన్నారు చంద్రబాబు. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో కమిటీలు, కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలపై దాడులు జరిగితే వెంటనే స్పందించాలని నేతలకు సూచించారు.

పెద్దనందిపాడు కార్యకర్తలతో భేటీకి ముందు తొలిసారిగా గుంటూరులోని రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆఫీసులోకి అడుగుపెట్టారు. గుంటూరు నుంచే రాష్ట్ర కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు. "టీడీపీకి ఎంతో చరిత్ర ఉందని, మళ్ళీ మనపై బాధ్యతలు పెరిగాయని నేతలకు సూచించారు చంద్రబాబు. 40శాతం ఓట్లు వేసిన ప్రజల కోసం పని చేయాలని పిలుపినిచ్చారు. రాజధాని కోసం 33వేల ఎకరాల భూమిని మనపైన ఉన్న నమ్మకంతో రైతులు ఇచ్చారని గుర్తు చేశారు.

పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో జగన్‌ సర్కారు తీరుపై చర్చ జరిగింది. తమ ప్రభుత్వంలోని తప్పులు వెదికేందుకే ఉపసంఘం వేశారని చంద్రబాబుకు తెలిపారు నేతలు. సబ్‌కమిటీ వేసిన 4 రోజులకే రివ్యూ మీటింగ్‌ పెట్టిన సీఎం జగన్‌.. ఎవరికీ సీరియస్‌నెస్‌ లేదని హెచ్చరించడంలో అంతర్యమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు.

అంతకుముందు ట్విట్టర్‌ వేదికగా.. జగన్ సర్కారుపై విమర్శలు చేశారు చంద్రబాబు. రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు రుణమాఫీ లేదన్న ఆయన.. అన్నదాత సుఖీభవ రద్దు చేశారంటూ ట్వీట్‌ చేశారు. బకాయిలు కూడా చెల్లించడం లేదంటూ విమర్శించారు. సాగుకు పెట్టుబడి లేని పరిస్థితులు ఉన్నాయన్న చంద్రబాబు.. ఎలాగోలా సాగుకు సిద్ధమైనా.. విత్తనాలు దొరకని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి ప్రణాళికా లోపం ఉందంటూ విమర్శించారు.చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఇవాళ, రేపు, పర్యటించనున్నారు. ఎన్నికల్లో వరుసగా గెలిపిస్తున్నందుకు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలపనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story