Andhra Pradesh: ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు.. పొత్తుకు మొగ్గుచూపుతున్న పార్టీలు..

Andhra Pradesh: ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు.. పొత్తుకు మొగ్గుచూపుతున్న పార్టీలు..
Andhra Pradesh: ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విపక్ష పార్టీలన్నీ ఒకే మాట మీదున్నాయి.

Andhra Pradesh: ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విపక్ష పార్టీలన్నీ ఒకే మాట మీదున్నాయి. ఒకే నినాదం వినిపిస్తున్నాయి. ఒకే వేదిక మీదకి వచ్చి చెప్పకపోయినా.. క్విట్‌ జగన్‌-సేవ్ ఏపీ అంటూ నినదిస్తున్నాయి. జగన్‌ సర్కార్‌ను గద్దె దింపుదాం అంటూ కొంతకాలంగా టీడీపీ బలంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా వైసీపీ సర్కార్‌ను సాగనంపాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు.

త్వరలోనే రాష్ట్రంలో అద్భుతం జరగబోతోందంటూ పొత్తులపై ఓ ట్రైలర్‌ వదిలారు. వన్‌సైడ్‌ లవ్‌.. టూ సైడ్‌గా మారబోతోంది. అటు జగన్‌ ఒంటెద్దు పోకడలను తట్టుకోలేకపోతున్నామంటున్న కమ్యూనిస్టు పార్టీలు సైతం అప్పుడే ఆందోళనలు కూడా మొదలు పెట్టాయి. ఇక ముందుకు రావాల్సిందల్లా ఒక్క బీజేపీ మాత్రమే. జగన్‌ను సీఎం కుర్చీ నుంచి దింపేందుకు పొత్తులకు సిద్ధమంటున్నాయి టీడీపీ, జనసేన. త్యాగాలకు సిద్ధం అని ఓపెన్‌గానే చెప్పేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.

అటు పవన్‌ కల్యాణ్ కూడా త్యాగాలకు సిద్ధపడ్డారు. సీఎం అవ్వాలనో, పెద్ద పదవుల్లో కూర్చోవాలనో ఆశలు తనకు లేవని క్లారిటీ ఇచ్చేశారు. ప్రజల మనసుల్లో తనకో పదవి ఉంటే చాలని మాట్లాడారు. దీన్ని బట్టి ఒక మెట్టు తగ్గడానికి సైతం జనసేన సిద్ధమేనన్న సంకేతాలిచ్చారు. పొత్తులపై టీడీపీ డైరెక్టుగా వచ్చి మాట్లాడితే తప్పకుండా ఆలోచిస్తానని పవన్‌ కల్యాణ్‌ కూడా తేల్చేశారు. సో, ఇక పొత్తులపై ముసుగులో గుద్దులాట లేనే లేదు.

టీడీపీ, జనసేన ఫుల్‌ క్లారిటీతో ఉన్నాయి. 2024లో పొత్తులతోనే వెళ్తామని స్పష్టమైన సంకేతాలిచ్చాయి. బీజేపీని కూడా ఈ పొత్తులోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీ బీజేపీ పెద్దలతో స్వయంగా మాట్లాడతానన్నారు పవన్ కల్యాణ్. టీడీపీ, జనసేన మధ్య పొత్తు చిగురించడంతో వైసీపీ బెంబేలెత్తుతోంది. ఈ రెండు పార్టీలు కలవకూడదన్న రీతిలో రెచ్చగొట్టే కామెంట్లు చేస్తోంది. సింహం సింగిల్‌గా వస్తుందని, సత్తా లేని వాళ్లే పొత్తులకు వెళ్తారంటూ మాట్లాడింది.

దీనికి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ దీటుగానే సమాధానం ఇచ్చారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోలేదా.. ఆయన కంటే జగన్‌ గొప్పోడా అంటూ కౌంటర్ వేశారు. అటు పవన్ కూడా.. సింగిల్‌గా వెళ్లాలని చెప్పడానికి మీరెవరంటూ వైసీపీని ఏకిపారేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ మళ్లీ కలిస్తే 2014 ఫలితాలే రిపీట్‌ అవుతాయన్న భయం జగన్‌కు పట్టుకుందంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌ ముందున్న స్ట్రాటజీ ఒక్కటే.

బీజేపీని అడ్డం పెట్టుకుని జనసేన, టీడీపీ మధ్య పొత్తు జరక్కుండా చేయడం. త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు రాబోతున్నాయి. సొంతంగా బలం లేని బీజేపీకి.. వైసీపీ మద్దతు చాలా అవసరం. ఈ సందర్భాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ద్వారా జనసేనను టీడీపీకి దూరం చేసేలా ఏదైనా డిమాండ్లు చేసే అవకాశం లేకపోలేదని పొలిటికల్‌ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు కూడా కొంతకాలం వరకే అన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు గనక టీడీపీతో పొత్తుల గురించి మాట్లాడితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీకి మద్దతివ్వకపోవచ్చు. ఆ ఎన్నికలు కాస్తా అయిపోతే.. సోము వీర్రాజు మాటే కాదు మొత్తం బీజేపీ స్టాండే మారుతుందన్న చర్చ జరుగుతోంది. త్వరలోనే అద్భుతం చూస్తారన్న పవన్‌ వ్యాఖ్యల వెనక మీనింగ్ ఇదేనని మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు అయిన తరువాత.. స్వయంగా పవన్‌ కల్యాణే ఢిల్లీ వెళ్లి పొత్తులపై బీజేపీ నేతలతో మాట్లాడతారని, రాష్ట్ర బీజేపీని కూడా ఇందులో కలుపుతారనే చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్నా.. విపక్షాలన్నీ ఒకే మాట మీదకు రావడానికి జగన్‌ పాలనే కారణం అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.

సంక్షేమం పేరుతో డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి లేకపోవడం, రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్క రాజధాని కూడా లేకుండా చేయడం, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, పెట్టుబడులు రాకపోవడంతో పాటు ఉన్న వాళ్లు వెళ్లిపోతుండడం, రాష్ట్రంలో వరుస అత్యాచారాలు, శాంతి భద్రతల సమస్యలు, రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నూనెలు, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, భారీగా పెరిగిన పన్నులు.. ఇలా ప్రజా సమస్యల కోసమే పొత్తులు పెట్టుకుంటున్నాం అని చెబుతున్నాయి తప్ప.. ఎక్కడా రాజకీయాల గురించి గాని, రాజకీయ లబ్ది గురించి గాని పార్టీలు మాట్లాడడం లేదు. విపక్షాలన్నింటినీ ఏకం చేస్తున్న ఒకే ఒక్క అంశం.. జగన్‌ పాలనా తీరు. అందుకే, ఈసారి రెండేళ్ల ముందే ఏపీలో పొత్తులపై పూర్తి స్పష్టత వస్తుందంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story