Maha Padayatra: మహాపాదయాత్రలో రైతులపై లాఠీఛార్జ్‌.. స్పందించిన చంద్రబాబు..

Maha Padayatra (tv5news.in)

Maha Padayatra (tv5news.in)

Maha Padayatra: అమరావతి మహా పాదయాత్రకు మద్దతుగా అడుగులు వేస్తున్న వారిపై లాఠీ విరిగింది.

Maha Padayatra: అమరావతి మహా పాదయాత్రకు మద్దతుగా అడుగులు వేస్తున్న వారిపై లాఠీ విరిగింది. ఇవాళ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో పాదయాత్రకు మద్దతుగా తరలివచ్చిన స్థానికులు, రైతులపై పోలీసుల లాఠీఛార్జ్‌తో ఒక్కసారిగా కలకలం రేగింది. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్‌కి మద్దతు తెలిపి, రైతులకు విరాళం ఇచ్చేందుకు వచ్చిన వారిపై పోలీసులు ఒక్కసారిగా లాఠీలతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కొట్టారు. రైతుల్ని ఉరుకులు పెట్టించారు. దీంతో.. నాగులుప్పలపాడు మండలం చదలవాడ దగ్గర తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.

ఈ లాఠీచార్జ్‌ ఘటనతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన రైతులు, స్థానికులు పోలీసులు, ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ పేరు చెప్పి కావాలనే యాత్రకు ఆటంకాలు కల్పిస్తున్నారని, వేలాది మంది సంఘీభావం తెలుపుతున్న నేపథ్యంలో, దాన్ని అడ్డుకునేందుకే ఇలా పోలీసులతో కలిసి కుట్రలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. లాఠీఛార్జ్ నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడుగడుగునా ఆంక్షలతో నియంత్రించి కుట్రలు చేస్తున్నారని వీటిని ఎదురుకొని తము ముందుకు సాగుతామని రైతులు అంటున్నారు. ఈ లాఠీఛార్జ్‌లో పలువురుకి గాయాలయ్యాయి. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తాము శాంతియుతంగానే ముందుకు వెళ్తామని అమరావతి పరిరక్షణ ఏజేసీ ప్రతినిధులు చెప్తున్నారు.

ఇవాళ అమరావతి మహా పాదయాత్ర 11వ రోజు మొదలవుతూనే పోలీసుల ఆంక్షలతో టెన్షన్ వాతావరణం కనిపించింది. యాత్రలో పాల్గొనకుండా టీడీపీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని చిలకలూరిపేటలో గృహనిర్బంధంలో ఉంచారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును మార్టూరులో హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ప్రజలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.

నాగులుప్పలపాడు మండలం చదలవాడ దగ్గర ఉద్రిక్తత పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతున్నా తాము మొక్కవోని దీక్షతో ముందుకే సాగుతున్నామని, కానీ ప్రభుత్వం కావాలనే పోలీసుల ద్వారా తమపై లాఠీఛార్జ్‌ చేయించిందని రైతులు ఆరోపిస్తున్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం కూడా పాదయాత్రపై ఇలాగే ఉక్కుపాదం మోపితే జగన్, షర్మిల పాదయాత్ర చేయగలిగేవారా గుర్తు తెచ్చుకోవాలంటున్నారు. రాజధాని కోసం నమ్మి భూములిచ్చిన రైతులపై ఇలా కక్షకట్టి దాడులు చేయడం సరికాదంటున్నారు.

రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పాదయాత్రను అణచివేసేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మహా పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న స్పందన చూసి జగన్ కు భయం పట్టుకుందన్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వారిపై లాఠీ ఛార్జ్ చేయడం దారుణమన్నారు చంద్రబాబు.

13 జిల్లాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అమరావతిని నిలిపివేసి...3 రాజధానుల పేరిట విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్లు దిగ్భందించి పాదయాత్రకు ఆటంకం కలిగించడం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పాదయాత్ర చేస్తున్న వారిని అడ్డుకోవడం మానుకోవాలన్నారు. లాఠీ ఛార్జ్ లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story