మార్కెట్‌లోకి మేడిన్ ఏపీ కియా కారు

ఏపీలో కియా మోటార్స్ మార్కెట్‌ను ప్రారంభించింది. తన తొలి కారు ” సెల్తోస్” ను విడుదల చేసింది. ప్రతి 6 నెలలకు కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెడ్తామని కియా ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరపున మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు కియా స్ఫూర్తితో ఏపీలో మరిన్ని పెట్టుబడులు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆకాక్షించారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చింది దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్. అనంతపురం జిల్లా పెనుగొండలో ప్లాంట్ నిర్మించి, కార్ల ఉత్పత్తి ప్రారంభించింది. మొట్టమొదటగా తయారు చేసిన సెల్తోస్ మోడల్ కారును విడుదల చేసింది. లాంచింగ్‌ ప్రోగ్రామ్‌లో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, శంకర్ నారాయణ పాల్గొన్నారు.. కారుపై సంతకాలు చేశారు.

ఈ నెల 22 నుంచి కొత్తకారు అమ్మకాలు మొదలు పెట్టనున్నట్లు కియా మోటార్స్‌ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో 13 వేల 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది. ఏటా 3 లక్షల కార్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి 6 నెలలకు కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని చెప్పారు.

కియా మొదటి కారు విడుదల కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఆటో మొబైల్‌ రంగంలో కియా ఒక నూతన ట్రెండ్‌ తీసుకురావాలన్నారు. కియా స్ఫూర్తితో ఏపీలో మరిన్ని కంపెనీలు రావాలని ఆకాంక్షించారు. కియా కారు లాంచింగ్‌ సందర్భంగా లోకేష్‌ కూడా తన సంతోషాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఏపీలో కియా ఒక దార్శనికుడి స్వప్నానికి ఫలితమని అన్నారు. కియా మోటార్స్‌ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి చంద్రబాబు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిదన్నారు. మొట్టమొదటి కారు విడుదల చేసినందుకు కియా యాజమాన్యానికి, సిబ్బందికి ట్విట్టర్‌ లో శుభాకాంక్షలు తెలిపారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *