పప్పుల చీటీ పేరుతో మోసం.. రూ.25 లక్షలతో పరార్..

పప్పుల చీటీ పేరుతో మోసం.. రూ.25 లక్షలతో పరార్..
చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల్ని కూడా ఈ విధంగానే మాటలతో మభ్య పెట్టేసరికి దాదాపు 700 మందికి పైగా మహిళలు అతడి వద్ద చీటీలు

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటే ఎవరైనా బుట్టలో పడతారు.. అందునా మరీ అమాయకపు స్త్రీలు ఇంటాయనతో గొడవ పడైనా, దాచుకున్న పదో పరకో జమ చేసి మరీ పప్పుల చీటి కట్టారు. కొన్ని రోజులు బాగానే సరుకులు సరఫరా చేశాడు.. రూ.25లక్షలు జమ చేసుకుని జెండా పీకేశాడు.. తెల్లారిపాటికి కస్టమర్ల కంటికి కనిపించకుండా ఊరు దాటాడు.

విశాఖ జిల్లా పాయకారావు పేట మంగవరం రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి పప్పుల చీటీ పేరుతో స్థానికంగా ఒక్కో కుటుంబం నుంచి నెలకు రూ.300 చొప్పున 12 నెలల పాటు డబ్బు కట్టించుకున్నాడు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల్ని కూడా ఈ విధంగానే మాటలతో మభ్య పెట్టేసరికి దాదాపు 700 మందికి పైగా మహిళలు అతడి వద్ద చీటీలు కట్టారు.

ఇలా ఒక్కొక్కరు రూ.3,600 చెల్లించగా అందరికీ రూ.4,500 విలువ చేసే బాస్మతి బియ్యం, నూనె, పప్పు దినుసులు ఇస్తామని హామీ ఇచ్చాడు. చీటీలు కట్టిన వారందరికీ గత నెలలోనే సరుకులు ఇవ్వాల్సి ఉంది. అయితే కొద్ది మందికి మాత్రమే సరుకులు అందించాడు. మిగతా వారికి ఈ నెల 10న సరుకులు ఇస్తానని హామీ ఇచ్చాడు.

దీంతో చీటీలు కట్టిన వారంతా అతడి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. చీటీల పేరుతో అతడు సుమారు రూ.25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు సోమవారం పాయకారావు పేట పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story