ఈ నెల 19 తర్వాతే రాష్ట్రాన్ని ..

ఈ నెల 19 తర్వాతే రాష్ట్రాన్ని ..

ఏపీలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. సూర్యుడి ఉగ్రరూపానికి జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లోంచి బయటకు రావాలంటనే భయపడిపోతున్నారు. మరో 3 రోజుల పాటు ఎండలతో పాటు వడగాల్పుల తీవ్రత కొనసాగుందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది.

ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు ఎండలు.. మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం పది దాటితే ఇంట్లోంచి బయటకు రావాలంటనే జనం భయపడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం నుంచి సింహపురి వరకు ఉక్కపోతతో జనం ఉడికిపోతున్నారు.. జూన్‌ నెలలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది..

కోస్తాలోని పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ సాగర తీరం భగభగలాడుతోంది. విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధిక టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి, పోడూరులో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా బొండపల్లి, కన్నెమెరకలోనూ 45 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 60 ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. 202 ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి విస్తరించకపోవడం, పశ్చిమ, వాయవ్య దిశ నుంచి వేడి గాలులు రాష్ట్రంపైకి రావడంతో కోస్తా అగ్నిగుండంగా మారిపోయింది.

.

అటు ఎప్పటి నుంచో ఊరిస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ నెల 19న రాష్ట్రాన్ని తాకుతాయ‌ని వాతావరణ శాఖ అంచ‌నా వేస్తోంది. అనంత‌పురం, చిత్తూరు జిల్లాల‌ను రుతుప‌వ‌నాలు పలకరించనున్నాయంటున్నారు అధికారులు. వీటి ప్రభావం కార‌ణంగా ఈనెల 19 నుంచి 24 వ తేదీ లోపు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story