మార్కాపురం, పుంగనూరులో మున్సిపల్‌ ఎన్నికలు బహిష్కరించిన టీడీపీ

మార్కాపురం, పుంగనూరులో మున్సిపల్‌ ఎన్నికలు బహిష్కరించిన టీడీపీ
50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న మార్కాపురం మున్సిపల్‌ ఎన్నికల్లో ఇలాంటి పరిణామం ఎప్పుడూ చోటుచేసుకోలేదన్నారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్‌ ఎన్నికలను టీడీపీ నాయకులు బహిష్కరించారు. మున్సిపల్‌ నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు తెరలేపారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కందుల నారాయణరెడ్డి మండిపడ్డారు. ఏకగ్రీవాల కోసం దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. అధికారులు సైతం అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తాము ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి.. ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న మార్కాపురం మున్సిపల్‌ ఎన్నికల్లో ఇలాంటి పరిణామం ఎప్పుడూ చోటుచేసుకోలేదన్నారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్‌ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని టీడీపీ నాయకులు అనీషా శ్రీనాథరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం, గాంధీజీ కలలను అధికార పార్టీ తుంగలో తొక్కిందని ఆరోపించారు. వైసీపీ అరాచకాలు, పోలీస్‌ యంత్రాంగం చేస్తున్న బలవంతపు ఉపసంహరణపై విరక్తితో ఎన్నికలు బహిష్కరిస్తున్నామన్నారు.


Tags

Read MoreRead Less
Next Story