ఆంధ్రప్రదేశ్

గ్రాఫిక్స్‌ అన్నవారు.. భవనాలు ఎక్కి దూకాలి : నారా లోకేశ్

గ్రాఫిక్స్‌ అన్నవారు.. భవనాలు ఎక్కి దూకాలి : నారా లోకేశ్
X

ఒకటి రెండు కాదు 300 రోజులుగా అవిశ్రాంతంగా సాగిస్తోన్న పోరాటమిది. అధికార బలాన్ని ప్రయోగించి ఉక్కుపాదం మోపినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు రాజధాని రైతులు, మహిళలు. 29 గ్రామాల్లో జై అమరావతి నినాదం మార్మోగుతూనే ఉంది. రాజధాని ఉద్యమం మూడు వందల రోజులు పూర్తిచేసుకుంది.. ఈ సందర్భంగా అమరావతి గ్రామాలు హోరెత్తాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరు ఆపబోమని స్పష్టం చేశారు.

రాజధాని గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో JAC జెండాను ఆవిష్కరించారు. ఆ తరువాత అమరావతి పరిరక్షణ మహోద్యమంలో అమరులైన 92 మంది అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. తుళ్లూరు, కృష్ణాయపాలెం, వెలగపూడి, యర్రబాలెం, వెంకటాయపాలెం, పెనుమాక తదితర గ్రామాల్లో ఉద్యమం జోరుగా సాగింది. ప్రతి శిబిరం నుంచి 100 మంది తుళ్లూరు శిబిరానికి ర్యాలీ నిర్వహించారు. కరోనా భయం వెంటాడుతున్నా, వర్షం కురుస్తున్నా పోరు బాటలో ముందుకు సాగారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జాతీయ జెండాలు, అమరావతి జేఏసీ జెండాలు చేతబట్టి నినదించారు.

అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు రాజధాని ప్రాంతంలోని ప్రతి పల్లె కదిలింది. తుళ్లూరులో సోమవారం తొమ్మిదింటికి ప్రారంభమైన పాదయాత్ర 4 గంటల పాటు కొనసాగింది. రాజధాని గ్రామాల్లో జై అమరావతి నినాదాలు హోరెత్తాయి. మహిళలు మరోసారి ముందుండి నడిచారు. వెలగపూడికి చేరుకునే సరికి రైతుల సంఖ్య భారీగా పెరిగింది. అటు.. వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు రైతులకు మద్దతుగా తరలివచ్చారు.

రైతుల ఉద్యమం 300 రోజుకు చేరిన సందర్భంగా... రైతులు, మహిళలకు సంఘీభావం తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. పెనుమాకలో రైతుల ఆందోళనకు మద్దతిచ్చిన లోకేష్‌.. జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. అమరావతి అంతా గ్రాఫిక్స్‌ అన్నవారు.. ఇక్కడి భవనాలు ఎక్కి దూకాలని సవాల్ విసిరారు. 3 రాజధానులపై ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో అంతిమ విజయం రాజధాని రైతులదేనంటూ భరోసా ఇచ్చారు. తుళ్లూరు, దొండపాడు, అనంతవరంలో పర్యటించి రైతులకు మద్దతు తెలిపారు నారా లోకేష్‌.

అటు.. రైతులు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు. తుళ్లూరులో అన్నదాతలు శవయాత్ర చేపట్టారు. రాజధాని ఉద్యమంలో అసువులు బాసిన 92మందికి పాడెలు కట్టి వాటిని భారీ ర్యాలీతో ఊరేగించారు. పాడెలు మోస్తూ తుళ్లూరు రెవెన్యూ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. ఓ శిబిరం ముందు నిలిపిన ట్రాక్టర్ ట్రాలీల మీద, ఎడ్ల బండ్ల మీద వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు రైతులు. ట్రాక్టర్ ట్రాలీ మీద ఉరి కొయ్యలను ఏర్పాటు చేసి " అమరావతి నిర్వీర్యం - రాజధాని ప్రజల మరణశాసనం" అనే సందేశముతో కూడిన నిరసన ప్రదర్శన చేశారు.

సేవ్‌ అమరావతి అంటూ రాజధాని గ్రామాల్లో రైతులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. 3 రాజధానులు వద్దంటూ గళమెత్తారు. వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా కదంతొక్కారు. ఏపీ భవిష్యత్ కోసం తమ భూముల్ని త్యాగం చేశామని.. ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయంతో తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు అమరావతే రాజధాని అన్న జగన్‌ ఇప్పుడు మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES