ఇళ్లను కూల్చడం దారుణం : నారా లోకేష్

ఇళ్లను కూల్చడం దారుణం : నారా లోకేష్
సుమారు 40 ఏళ్ల నుంచి తాము ఇక్కడే నివసిస్తున్నామని.. రేకుల షెడ్డు వేసుకొని జీవిస్తున్న తమను రోడ్డున పడేశారని వాపోతున్నారు. జేసీబీల ద్వారా అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో 120 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. సుమారు 40 ఏళ్ల నుంచి తాము ఇక్కడే నివసిస్తున్నామని.. రేకుల షెడ్డు వేసుకొని జీవిస్తున్న తమను రోడ్డున పడేశారని వాపోతున్నారు. జేసీబీల ద్వారా అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో వివాదం ఉండగా.. ఎలా కూలుస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కష్టపడి డబ్బులు పెట్టి కొన్నామని.. ఇప్పుడు అప్పుల పాలైపోయాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఇళ్లు కూల్చివేత దారుణమన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఘటనపై నియోజకవర్గ నేతలతో మాట్లాడి బాధితులకు అండగా నిలవాలని లోకేష్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా కూలీల ఇళ్లు కూలగొడతారా అని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా సెలవు రోజు విధ్వంసం ఏంటని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేవరకు టీడీపీ పోరాడుతుందని నారా లోకేష్ స్పష్టం చేశారు.

జగన్ రెడ్డి పాలనలో జే ట్యాక్స్ వసూలు కాకపోతే జేసీబీలతో విధ్వంసం సృష్టిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా.. పేదలకు ఒక్క ఇళ్లు కూడా కట్టలేని సర్కారుకి నిరుపేదల ఇళ్లు కూలగొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్ల నుంచి రేకుల షెడ్డులు వేసుకొని జీవిస్తున్న 120 నిరుపేద కుటుంబాలను నడిరోడ్డున పడేయడం న్యాయం కాదన్నారు.

ఈ వివాదం కోర్టులో ఉందని.. బాధితులకు అండగా టీడీపీ న్యాయపోరాటం సాగిస్తుండగానే ఇలా కూల్చివేత అరాచక పాలనకి నిరదర్శనమన్నారు. కోర్టు ఆదేశాలను పాటించకుండా బాధితుల లాయర్‌కి వాట్సప్‌లో సమాచారం పంపి ఇళ్లు కూల్చివేతకి దిగడం ఎవరి ఆదేశాలతో చేశారో సంబంధిత తహశీల్దార్ సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story