NTR_ Chandrababu : అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు.. ఆనాటి సభలో ఎన్టీఆర్ శపథం ఏంటంటే?

NTR_ Chandrababu : అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు.. ఆనాటి సభలో ఎన్టీఆర్ శపథం ఏంటంటే?
NTR_ Chandrababu : ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన శపథం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది

NTR_ Chandrababu : ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన శపథం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆనాడు ఎన్టీఆర్‌ సైతం కాంగ్రెస్‌ తీరు నిరసిస్తూ శపథం చేశారు. ఒకనాడు జయలలితను అవమానించినప్పుడు కూడా ఇలాగే ప్రతిజ్ఞ చేశారు. ప్రజాక్షేత్రంలో గెలిచాకే అడుగుపెడతానని శపథం చేసి.. సగర్వంగా అధికారం చేజిక్కించుకున్నారు. చంద్రబాబు సైతం అదే ప్రతిజ్ఞ చేయడంతో ఒకప్పటి సందర్భాలను గుర్తుచేసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తాను.. అంతవరకూ వెళ్లను అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి ఇలా శపథం చేసిన వాళ్లంతా తిరిగి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు సభలో అడుగుపెట్టబోనని ఆనాడు ఎన్టీఆర్‌ సైతం అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. 1993లో ఎమ్మెల్యే శివారెడ్డి హత్య అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ఘటనపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ జరిపించాల్సిందేనంటూ ఎన్టీఆర్​పట్టుబట్టారు. అయితే, అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మాత్రం న్యాయవిచారణ డిమాండ్‌ను తిరస్కరించారు.

ఆ సమయంలో సీఎం సమాధానాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. వెంటనే టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ జాబితాలో ఎన్టీఆర్‌ను కూడా చేర్చడంపై మండిపడ్డారు. తనను ఏ కారణంతో సస్పెండ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో నాయకులకు గౌరవం లేనిచోట తాను ఉండలేనని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నంతకాలం సభలో అడుగుపెట్టనని శపథం చేశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించటంతో అసెంబ్లీలో అడుగుపెట్టి.. తన శపథాన్ని నేరవెర్చుకున్నారు.

తమిళనాడు అసెంబ్లీలోనూ జయలలితకు అవమానం జరిగింది. నిండు సభలో అధికారపక్ష ఎమ్మెల్యేలే దారుణంగా అవమానించారు. ఒక మహిళ పట్ల ప్రవర్తించకూడని రీతిలో వ్యవహరించారు. ఆ అవమాన భారంతో జయలలిత సైతం శపథం చేశారు. గెలిచాకే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ ప్రతిజ్ఞ చేశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో జయలలిత భారీ మెజారిటీతో గెలిచారు.

చంద్రబాబు సైతం అదే తరహా అవమానాలను ఎదుర్కొన్నారు. సభలో ప్రజా సమస్యలపై జరగాల్సిన చర్చను పక్కనపెట్టి.. చంద్రబాబు కుటుంబ సభ్యులపై తప్పుడు మాటలు మాట్లాడారు. రన్నింగ్‌ కామెంటరీ చేశారు. రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు, ఈ తరహా మాటలు ఎప్పుడూ కనీవినీ ఎరుగని చంద్రబాబు.. వాటిని భరించలేకపోయారు. అదే సందర్భంలో తన కుటుంబంపై చేస్తున్న వ్యాఖ్యలను వారించడానికి మాట్లాడుతుంటే మైక్‌ కట్‌ చేశారు. వ్యక్తిత్వ హననానికి దిగుతూ అవమానిస్తున్నా సరే.. తన బాధను చెప్పుకుంటుంటే మైక్‌ తీసేయడం మరింత బాధపెట్టింది. దీంతో ఇలాంటి కౌరవ సభలో తాను ఉండలేనంటూ తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ శపథం చేశారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story