నేడు ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి

నేడు ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి
ఎన్టీఆర్ 25 ఏళ్ల క్రితం అందరికీ భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు మాత్రం నేటికీ అందరిలోనూ అదే స్ఫూర్తిని నింపుతున్నాయి.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగు జాతి ముద్దుబిడ్డ, ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలందరూ ఆప్యాయంగా పిలుచుకునే అన్న.. అభిమానుల పాలిట దైవం.. స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈ దివ్యమోహన రూపం సినిమాల్లో, తాను పోషించిన పాత్రల ద్వారా ఎందరికో స్పూర్తి నిచ్చింది. తిరిగి ఆ రూపమే రాజకీయాల్లో తాను ప్రవేశపెట్టిన సంచలన, సంక్షేమ పథకాల ద్వారా మరెందరికో మార్గదర్శకంగా నిలిచింది. బడుగు, బలహీన వర్గాల పాలిట వరమైంది.

తెలుగు జాతిలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే. మహాభారత, భాగవత, రామాయణాల్లోని పాత్రలకు సహజత్వాన్ని తీసుకొచ్చి మన కళ్ళముందు కదలాడారు. అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ.. ఓ మహాయోధుడిగా, ఓ కారణజన్ముడిగా, ఓ యుగపురుషుడిగా నిలిచారు ఎన్టీఆర్.

తెలుగు జాతికీ, భాషకూ విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన సాధించిన విజయాల గురించి, అద్భుతాల గురించి చెప్పుకోవాలంటే అదో పెద్ద గ్రంథమే అవుతుంది. ఆయన నటజీవితంలో అనితరసాధ్యమైన ఎన్నో మైలురాళ్ళున్నాయి. రాజకీయ తెరపైనా ఎన్టీఆర్‌ ముద్ర సుస్పష్టం.

తెలుగు వారి గుండెల్లో అన్నగా కీర్తించబడ్డ విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు. కేవలం నటుడిగానే కాక రాజకీయ నేతగా కూడా ఎంతోమంది మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్. దాదాపు 400 సినిమాల్లో నటించిన ఎన్టీఆర్... పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో పోషించిన పాత్రలతో అశేష ప్రేక్షకాదరణ పొందారు.

ఎన్టీఆర్ తన ప్రతిభను కేవలం సినిమాకే పరిమితం చేయకుండా, రాజకీయాలలోనూ రాణించి దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. పేదల బతుకుల తలరాతలను మార్చే కార్యక్రమాలెన్నిటికో శ్రీకారం చుట్టారు.

ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా ఆయన అభిమానులెందరో ఎవరికి వారే సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. అన్న ఆశయ సాధనకు తమవంతు కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా.. ఆయన చేసిన పాత్రలు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోతాయి. ఇప్పటికి ఎందరో అభిమానులు ఆయనను ఒక దేవుడిగా కొలుస్తుండగా, ఎన్టీఆర్ నటించిన పాత్రలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్ని తరాలైనా మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.

'తెలుగు జాతి'కి గర్వకారణం తెలుగు పలుకులను తన కంఠంతో కొత్తపుంతలు తొక్కించిన ఆ అవిశ్రాంత యోధుడు 25 ఏళ్ల క్రితం అందరికీ భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు మాత్రం నేటికీ అందరిలోనూ అదే స్ఫూర్తిని నింపుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story