AP Pegasus: పెగాసెస్ వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం..

AP Pegasus: పెగాసెస్ వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం..
AP Pegasus: ఏపీ రాజకీయాల్లో పెగాసెస్ వ్యవహారం దుమారం రేపుతోంది.

AP Pegasus: ఏపీ రాజకీయాల్లో పెగాసెస్ వ్యవహారం దుమారం రేపుతోంది. చంద్రబాబు హయాంలో పెగాసెస్ స్ప్రైవేర్ కొన్నారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేశారంటూ మంత్రులు, వైసీపీ నేతల వ్యాఖ్యలు.. టీడీపీ నేతల కౌంటర్లతో రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. అసెంబ్లీలో పెగాసెస్ అంశాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి లేవనెత్తారు.

పెగాసెస్‌పై సభ్యుల్లో ఆందోళన ఉందని చెప్పారు. టీడీపీ హయాంలో నాడు ఐబీ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు సూచనతో టెండర్లు ఆహ్వానించారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేశారని.. అయితే ఆ తర్వాత ఆకస్మికంగా రద్దు చేశారని చెప్పారు. పెగాసెస్‌ వ్యవహారంపై విచారణ కోసం సభా సంఘం ఏర్పాటు చేయాలని స్పీకర్‌కు మంత్రి బుగ్గన కోరారు.

పెగాసెస్‌ వ్యవహారంలో మంత్రులు, వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు టీడీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ను టీడీపీ కొనుగోలు చేసిందన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా..? లేదా..? అనే క్లారిటీ లేదన్నారు. బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసెస్ ప్రస్తావన కూడా లేదని బెంగాలీ తెలిసిన తన స్నేహితుడు చెప్పారని తెలిపారు.

పెగాసెస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తుదారుకు సమాధానం ఇచ్చారని చెప్పారు. వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు పెగాసెస్ సాఫ్ట్‌వేర్ అమ్మలేదని ఇజ్రాయెల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో పెగాసెస్‌ అంశాన్ని చర్చకు పెట్టడం, హౌస్ కమిటీ వేయడాన్ని తప్పుబట్టారు.

అంబటి రాంబాబుకు చురకలంటించిన నారా లోకేష్.. జ‌గ‌న్ బాబాయ్ హత్య విషయంలోనూ.. మద్యం మరణాల విషయంలోనూ విచారణ వేయగలరా..? అంటూ ప్రశ్నించారు. పెగాసెస్‌పై జుడీషియల్‌, సీబీఐ విచారణ.. దేనికైనా సిద్ధమని నారా లోకేష్ సవాల్ విసిరారు. ఇటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సైతం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

పెగాసెస్ పేరుతో నాటుసారా అంశాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. మరోవైపు పెగాసస్‌ స్పైవేర్‌ విచారణకు స్పీకర్ తమ్మినేని సీతారాం.. హౌస్‌ కమిటీ వేయడం, కమిటీలోని సభ్యులను రెండ్రోజుల్లో ప్రకటిస్తామని చెప్పడం చకచకా జరిగిపోయాయి. మొత్తానికి ఏపీలో పెగాసెస్ వ్యవహారంపై ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల మంటలు రేపుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story