Elamanchili : రాజుగారి కోటకు బీటలు?

Elamanchili : రాజుగారి కోటకు బీటలు?
Elamanchili : యలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ ప్రతిష్టకు భంగం కలుగుతోందా? తనకు ఎదురే లేదని ఎమ్మెల్యే కన్నబాబు భావిస్తుండడంతోనే అసలు సమస్య వస్తోందా?

Elamanchili : యలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ ప్రతిష్టకు భంగం కలుగుతోందా? తనకు ఎదురే లేదని ఎమ్మెల్యే కన్నబాబు భావిస్తుండడంతోనే అసలు సమస్య వస్తోందా? జిల్లాలో భూ వివాదాల్లో కన్నబాబు పేరు అధికంగా విన్పిస్తోందా? గతంలో వంద కోట్ల ఎన్నారై భూమి, ఇటీవల ఎండాడ హయగ్రీవ లాండ్ వివాదాల్లో కన్నబాబు పేరు వినిపిస్తుండడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుందా? ఆయనకు విపక్షం కంటే స్వపక్షం నుంచే పోరు ఎక్కువైందా? స్వపక్షానికి సాక్షాత్తూ అధిష్టానమే అండగా ఉందన్నమాట నిజమేనా? కన్నబాబు రాజు కోటకు భవిష్యత్తులో బీటలు తప్పేలాలేవా? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకొచ్చిన వ్యక్తి కన్నబాబు రాజు. స్థానికేతరులను ఆదరించే నియోజకవర్గంగా పేరున్న యలమంచిలిలో... 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కన్నబాబు. 2014 మినహా నియోజకవర్గoలో 2004 నుంచి ఇప్పటివరకూ ఎదురులేని వ్యక్తిగా కొనసాగుతున్నారు. 2019లో గెలిచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అయిన కన్నబాబు రాజుపై ఆదినుంచి వివాదాస్పద నేతగా ముద్రపడింది. మరోవైపు నియోజకవర్గంలో అభివృద్ధి ఆమడదూరంలో ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో వారిలో అసహనం కట్టలు తెంచుకుంటుందోని టాక్

కన్నబాబురాజు నియోజకవర్గ అభివృద్ధిని పక్కనపెట్టిన స్వలాభం చూసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన హామీలు గాలికొదిలేశారన్న టాక్ పబ్లిక్ నుంచి రిసౌండ్ లా విన్పిస్తోంది. యలమంచిలి చుట్టు పక్కల జనాల చిరకాల కోరికైన ఫ్లై ఓవర్ బ్రిడ్జిని... తాను గెలిసిన నెల రోజుల్లోనే పూర్తిచేస్తానన్న కన్నబాబు రాజు మాట... నీటి మూటగానే మిగిలిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. పట్టణాన్ని పట్టి పీడిస్తున్న మరో దీర్ఘకాలిక సమస్య... యానాద్రి కాలువ. పెద్దవర్షం పడినప్పుడల్లా ఆ వర్షపు నీటితో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అంటూ పట్టణ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక నియోజకవర్గంలోని ఎస్ఈజడ్ కు వెళ్లే ప్రధాన రహదారి సహా రోడ్లన్నీ గోతులమయం కావడంతో వాహన దారులకు నిత్యం నరకయాతన తప్పడం లేదు.

అభివ్రుద్ధి, అధ్వానంగా ఉన్న రోడ్లపై ఎమ్మెల్యే కన్నబాబురాజును నిలదీయాలంటే జనానికి వెన్నులో భయం పుడుతోందట. దానికి కారణం... ఆయన నోరువిప్పితే బూతులే బూతులట. స్వపక్షం, విపక్షం, అధికారులూ, ప్రజలు అనే తేడా లేకుండా బూతు పురాణం అందుకుంటారని జనం చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు నియోజకవర్గంలో అనేక భూ వివాదాల్లో కన్నబాబు పేరు గట్టిగా వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భూదందాల విషయంలో బాధితులు లోకల్ పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేసినా... కన్నబాబు ధాటికి తాళలేక పోలీసులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఆ పంచాయతీలన్నీ విశాఖ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న దాఖలాలు కోకొల్లలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాండిడేట్ ని బెదిరించిన కేసులో రాష్ట్రంలోనే అరెస్టైన అధికార పార్టీ ఎమ్మెల్యేగా కన్నబాబు ఘనకీర్తిని పొందారు.

కొమ్మాదిలో రూ.100 కోట్ల భూమిని చౌకగా కొట్టేయడానికి ప్రయత్నించి భంగపడిన పరిస్థితిని ఎమ్మెల్యే కన్నబాబు ఎదుర్కొన్నారు. భూమికి ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవని, పోయాయని, పత్రిక ప్రకటన ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చన్న దళారులను కలిసి కన్నబాబు ఓ పథకం రచించారని ప్రచారం జరుగుతోంది. లాభసాటి బేరం వచ్చిందనుకుని రంగంలోకి దిగిన కన్నబాబుకి అప్రతిష్ఠ మూటకట్టుకున్నారట. మొత్తం 12.26 ఎకరాల భూమిని కేవలం రూ.18.7 కోట్లకే దక్కించుకుందామనుకున్న తరుణంలో కథ అడ్డం తిరిగింది. విదేశాల్లో ఉన్న భూ యజమాని ప్రసన్న ఆన్ లైన్ లో పోలీసు కమిషనర్ కి ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే కన్నబాబుకు ఊహించని షాక్ తగిలింది. విషయం బైటకి పొక్కడంతో ఎమ్మెల్యే కన్నబాబు మోసపోయాననడం విడ్డూరమంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఇదే తరహాలో ఇటీవల ఎండాడ హయగ్రీవ లాండ్ స్కామ్ లోనూ కన్నబాబు పేరు విన్పించడంతో అమరావతి పెద్దలు క్లాస్ పీకినట్లు గుసగుసలు వినిపిoచాయి.

ఒకవైపు తన తీరుతో పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న... కన్నబాబు రాజుకు స్వపక్షం నుంచి ఊహించని షాక్ తగులుతోంది. మూడు దశాబ్దాల పాటు టీడీపీలో ఉన్న విశాఖ డెయిరీ అధినేత ఆడారి ఆనంద్ 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత తన సోదరి పిళ్లా రమాకుమారితో సహా వైసీపీలో చేరారు. వీరి నిర్ణయానికి కారణం అధికార పార్టీ బెదిరింపులే అనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడదే కన్నబాబుకి రాజకీయంగా... స్వపక్షమైన ఆడారి తులసీరావు కుటుంబం నుంచి భవిష్యత్తులో పోటీ తప్పని పరిస్థితి వస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రభావంతోనే మున్సిపల్ ఎన్నికల్లో యలమంచిలి వైసీపీలో మొదటిసారి గ్రూపుల గోల బయటపడినట్లు టాక్ వినిపిస్తోంది.

కన్నబాబు వర్గం మున్సిపల్ పీఠం కోసం సిద్ధమవ్వగా, ఆడారి వర్గమైన పిళ్లా రమాకుమారి చైర్ పర్సన్ పదవిని ఆశించడంతో రగడ మొదలయినట్లు పార్టీలో చర్చ నడిచింది. చివరికి ఈ పదవుల పంచాయితీ ఎంపీ విజయసాయిరెడ్డి వద్దకు చేరినట్లు టాక్. విజయసాయిరెడ్డి ఆశీస్సులతో ఆనంద్ సోదరి పిళ్లా రమాకుమారి చైర్ పర్సన్ గా ఎన్నికవ్వడం... కన్నబాబుకి చెక్ పెట్టినట్లయ్యిందనే చర్చ పార్టీ శ్రేణుల్లోనే నడిచింది. అప్పట్నుంచి రాజుగారి కోటలో గ్రూపుల గోల అడుగడుగునా కనబడుతూనే ఉందని టాక్ వినిపిస్తోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తన వారసుడైన సుకుమార్ వర్మని బరిలోకి దింపేందుకు కన్నబాబు రాజు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆడారి ఆనంద్ కుమార్ రూపంలో తన కుమారుడి భవిష్యత్తుకు ముప్పొస్తుందన్న టెన్షన్ కన్నబాబురాజులో కనిపిస్తోందనే టాక్ ఉంది. మరోవైపు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష బాబు... వచ్చే ఎన్నికల్లో యలమంచలి సీటు ఆశిస్తున్నారట. ఇలా అన్ని వైపులా పొంచి ఉన్న ముప్పుతో కన్నబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారని సమాచారం.

అయితే నియోజకవర్గంలో అభివృద్ధి పనులేవీ జగకపోవడంతో వైసీపీలో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలూ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుండడం కన్నబాబుకి మింగుడు పడడం లేదని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన ప్రతిచోటా మా ఊర్లో రోడ్లు ఎప్పుడేస్తారంటూ కన్నబాబుని నిలదీస్తుండడం! అందుకు గవర్నమెంటు దగ్గర డబ్బులు లేవని స్వయంగా ఆయనే చెప్పడం ప్రస్తుతానికైతే కొసమెరుపు. కానీ భవిష్యత్తులో ఇదే కొంపముంచుతుందేమోననే భయం ఆయనను వెంటాడుతున్నట్లు బాహాటంగానే చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story