తిరుపతిలో ఊపందుకున్న లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారం

తిరుపతిలో ఊపందుకున్న లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారం
చిన్నాన్న కుటుంబానికి న్యాయం చేయని జగన్‌.. ఐదు కోట్ల ఆంధ్రులకు న్యాయం చేస్తాడా అంటూ ప్రశ్నించారు తులసీ రెడ్డి .

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. గ్రామాలను చుట్టేస్తున్నారు. నెల్లూరు జిల్లా మునుబోలులో జరిగిన ప్రచారంలో అభ్యర్థి పనబాక లక్ష్మితో పాటు.. మాజీ మంత్రి సోమిరెడ్డి పాల్గొన్నారు. దుకాణాల్లో కరపత్రాలు పంచారు. ప్రచారంలో భాగంగా.. ఓ హోటల్‌లోకి వెళ్లి.. టీ అందించారు. అలాగే బస్సులో ఎక్కి.. ప్రయాణికులను పలకరించారు. అనంతరం కూరగాయల మార్కెట్‌లో ప్రచారం చేశారు.

వైసీపీ ప్రభుత్వం సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ చనిపోతే ఆయన కుటుంబ సభ్యులకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. జగన్నాథ యాత్రలో కాళ్ల నొప్పులు సరిచేసిన వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు 500 ఇస్తే తీసుకోవద్దని.. 10 వేల రూపాయలు ఇస్తే తీసుకోవాలంటూ ఓటర్లకు సూచించారు సోమిరెడ్డి.

అటు రేణిగుంట ‌ పంచాయతీ వేణుగోపాలపురం, ఒడ్డిమిట్టలో బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి, ఖాదర్ బాషా ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల్లో పనబాక లక్ష్మిని గెలిపిస్తే వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట పడినట్లు అవుతుందని సుధీర్‌ రెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చింతామోహన్‌కు మద్దతుగా.. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసీ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ అంటూ హడావుడి చేసిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్నాన్న కుటుంబానికి న్యాయం చేయని జగన్‌.. ఐదు కోట్ల ఆంధ్రులకు న్యాయం చేస్తాడా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడలు వంచుతానన్న జగన్‌.. ఆ మాట కూడా ఎత్తడం లేదని.. మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా అని తులసీరెడ్డి ప్రశ్నించారు.


Tags

Read MoreRead Less
Next Story