ఒక్కసారిగా హీటెక్కిన బెజవాడ రాజకీయం

ఒక్కసారిగా హీటెక్కిన బెజవాడ రాజకీయం
టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడే కట్టడి చేశారు పోలీసులు. కార్యకర్తలు కూడా రాకుండా చుట్టుపక్కల రోడ్లన్నీ బ్లాక్ చేశారు.

TDP-YCP వర్గాల పోటాపోటీ సవాళ్లతో కృష్ణా జిల్లా గొల్లపూడి రోజంతా రణరంగాన్ని తలపించింది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని దాటుకుని మరీ NTR విగ్రహం వద్దకు చేరుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ.. దమ్ముంటే మంత్రి కొడాలి నాని చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చెప్పినట్టుగానే NTRకి నివాళులు అర్పించి దీక్షకు సిద్ధమయ్యారు. ఆయన్ను అడ్డుకున్న పోలీసులు వెంటనే వాహనంలో అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దేవినేని ఉమ అరెస్టు సందర్భంగా గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు తలెత్తాయి. అదే సమయంలో YCP కార్యకర్తలు కూడా NTR సెంటర్‌కు వచ్చే ప్రయత్నం చేయడం, పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఒక్కసారిగా రెట్టింపైంది.

ఈలప్రోలు వైపు దేవినేని ఉమను తీసుకువెళ్తున్న సమయంలో అక్కడ కూడా టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. చివరికి అందర్నీ చెదరగొట్టి పమిడిముక్కల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి చేరుకోవడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దేవినేనిని తక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేశారు టీడీపీ నేతలు. అంతకుముందు... హనుమంతపురం క్రాస్‌రోడ్డుపై మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్‌ తాతయ్య, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. అటు తమ జీపును అడ్డుపెట్టి... ట్రాఫిక్‌ను నిలిపివేశారు పోలీసులు. టీడీపీ ఆందోళనలతో పమిడిముక్కల పీఎస్‌ వద్ద టెన్షన్ కొనసాగింది..చివరికి దేవినేనిని కలిసేందుకు కొంతమంది నేతలకు అనుమతి ఇచ్చారు పోలీసులు. ఆ తర్వాత విడుదలైన దేవినేనిని ఉమ కొడాలినాని తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు..భౌతిక దాడులకు దిగుతామన్న మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా... టీడీపీ నేతలను అక్రమ అరెస్టులు చేయడం పౌరహక్కుల ఉల్లంఘనేనని అన్నారు.. ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయని క్రూరస్వభావం జగన్‌ది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..జగన్ పాలనలో రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు...అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు . ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడిన మంత్రి కొడాలి నానితోపాటు... వైసీపీ నేతలపైనా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

మంత్రి కొడాలి నానిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను అరెస్టు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

దేవినేని ఉమకు మద్దతుగా గొల్లపూడి బయలుదేరిన టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడే కట్టడి చేశారు పోలీసులు. కార్యకర్తలు కూడా రాకుండా చుట్టుపక్కల రోడ్లన్నీ బ్లాక్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు.



Tags

Read MoreRead Less
Next Story