ఎస్ఈసీపై అదే పగ.. వ్యవస్థపై పదేపదే దాడి

ఎస్ఈసీపై అదే పగ.. వ్యవస్థపై పదేపదే దాడి

*ఎస్ఈసీపై అదే పగ

*వ్యవస్థపై పదేపదే దాడి

*ఎన్నికల కమిషన్‌కు సహకరించని ఏపీ

*తీవ్ర పరిణామాలు తప్పవన్న హైకోర్టు

ఇవాళ ఈ ప్రభుత్వం, రేపు మరో ప్రభుత్వం..కాని, వ్యవస్థలు శాశ్వతం అంటూ ఏపీ సర్కారుకు చురకలు అంటించింది హైకోర్టు. కారణాలు వెతుక్కుని మరీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇబ్బందులు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డ స్థానంలో జస్టిస్ కనగరాజ్‌ను తీసుకొచ్చి పెద్ద తతంగాన్నే నడిపింది. ఆ నియామకం చెల్లదని తెలిసినా కోర్టు గడప తొక్కి మరీ పరువు పోగొట్టుకుంది. ఆనాడు తన తప్పును గెలిపించుకోడానికి అయిన ఖర్చును రాష్ట్ర ఎన్నికల సంఘమే భరించాలంటూ అర్ధంలేని మెలిక పెట్టింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్.

జస్టిస్ కనగరాజ్ లీగల్ ఖర్చులను ఎస్ఈసీనే భరించాలనడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇష్టంలేదని ఓ వ్యక్తిని తొలిగించారు, తిరిగి న్యాయబద్దంగా రాజ్యాంగ పదవిలోకి వస్తే ఇలా వ్యవహరిస్తారా అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్‌ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ తీరు సరికాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఎస్ఈసీకి సహకరించడం లేదని తమకు అనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది.

జస్టిస్‌ కనగరాజ్ కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్ని ఎస్ఈసీ చెల్లించక్కర్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ డబ్బులు కనగరాజ్‌ వ్యక్తిగతంగానే చెల్లించాలని స్పష్టం చేసింది. ఎస్ఈసీకి ఏం కావాలో మూడు రోజుల్లోగా ఓ వినతిపత్రం రూపంలో ప్రభుత్వానికి అందించాలని స్పష్టం చేసింది. ఆ వినతిని పరిశీలించడమే కాదు.. కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కూడా ధర్మాసనం చెప్పింది. ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. నిజాయితీగా పనిచేసే అధికారులను ఇబ్బందిపెట్టడం మంచికాదని హితవు పలికింది హైకోర్టు. తదుపరి విచారణను ఈ నెల 20 కి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story