నేడు చెన్నైలో శశికళ పర్యటన.. వివాదాస్పదంగా మారిన పోస్టర్లు

నేడు చెన్నైలో శశికళ పర్యటన.. వివాదాస్పదంగా మారిన పోస్టర్లు
శశికళ చెన్నై చేరుకోగానే పార్టీలోని అసంతృప్త శాసనసభ్యులు అన్నాడీఎంకే నుంచి వైదొలగి దినకరన్‌ పార్టీలో చేరుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ ఇవాళ చెన్నైలో పర్యటించనుండటంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. రాష్ట్ర సరిహద్దులోని హోసూరు నుంచి చెన్నై నగరం వరకూ వెయ్యి కార్లతో ఊరేగింపు, స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడానికి అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్‌ భారీ సన్నాహాలు చేపడుతున్నారు. ప్రత్యేకించి చెన్నై పోరూరు నుంచి మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధి వరకూ 12 చోట్ల స్వాగత సత్కార సభల నిర్వహణకు పోలీసుల అనుమతి కోరుతూ వినతిపత్రం కూడా సమర్పించారు. శశికళ చెన్నై నగరానికి వస్తున్నారనే వార్త వచ్చినప్పటి నుంచి అధికార అన్నాడీఎంకేలో తీవ్ర కలకలం ఏర్పడింది. తేని, తిరుచ్చి, చెన్నై జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు శశికళను స్వాగతిస్తూ పోస్టర్లు వేయడం వివాదాస్పదంగా మారింది. శశికళ చెన్నై చేరుకోగానే పార్టీలోని అసంతృప్త శాసనసభ్యులు అన్నాడీఎంకే నుంచి వైదొలగి దినకరన్‌ పార్టీలో చేరుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శశికళ దూకుడుకు కళ్లెం వేసే దిశగా చేపట్టాల్సిన చర్యలు, పొత్తుల ఖరారుపై అన్నాడీఎమ్‌కే నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి పళనిస్వామి, సమన్వకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సమావేశమై చర్చలు జరిపారు. శశికళ ఆగమనం పార్టీలో సృష్టిస్తున్న సంక్షోభ పరిస్థితులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు గురించే ప్రధానంగా చర్చించారు.

జయలలిత సమాధి వద్ద శశికళ శపథం చేసేందుకు అవకాశాలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అక్కడి మ్యూజియం పనులను పూర్తి చేయాలనే కారణంగా మూసివేసింది. దీంతో శశికళ జయ సమాధి వద్దకు కాకుండా రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం వరకూ ర్యాలీ జరుపనున్నారని సమాచారం. మరోవైపు.. శశికళ కారుపై అన్నాడీఎంకే పార్టీ జెండాను ఉపయోగించకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, మంత్రులు డీజీపీకి ఫిర్యాదు చేశారు.

అక్రమార్జన కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించిన తర్వాత శశికళ జనవరి 27న విడుదలయ్యారు. కరోనాకు గురైన శశికళ బెంగళూరు విక్టోరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయినప్పుడు జయలలిత ఉపయోగించిన కారులోనే ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఆ కారుకు అన్నాడీఎంకే జెండా ఉండటం సంచలనం కలిగించింది. ఆ విషయమై అమ్మా మక్కల్‌ మున్నేట్రకళగం నాయకుడు దినకరన్‌ మాట్లాడుతూ శశికళ ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, ఆ పదవి నుంచి ఆమెను ప్రస్తుత పాలకులు తొలగించిన వివాదంపై హైకోర్టులో విచారణ జరుగుతోందని తెలిపారు. ఇలా మొత్తానికి శిశకళ రేపటి చెన్నై పర్యటన.. తమిళనాడులో రాజకీయ ఉత్కంఠకు తెరలేపింది.


Tags

Read MoreRead Less
Next Story