ఏపీలో ఇవాల్టి నుంచి స్కూళ్లు ప్రారంభం..స్కూళ్లు తెరవడంపై భిన్నాభిప్రాయాలు

ఏపీలో ఇవాల్టి నుంచి స్కూళ్లు ప్రారంభం..స్కూళ్లు తెరవడంపై భిన్నాభిప్రాయాలు

File Photo

Andhra Pradesh: ఏపీలో ఇవాల్టి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ...

Schools Reopen: ఏపీలో ఇవాల్టి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ... తరగతులు నిర్వహించేందుకు ఏపీ సర్కారు రెడీ అయింది. అయితే.. స్కూళ్లు తెరవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారని కొందరు తల్లిదండ్రులు అంటుంటే... థర్డ్‌ వేవ్‌ భయం మరికొందరిని వెంటాడుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం.. ఇవాల్టి నుంచి స్కూళ్లను ప్రారంభించనుంది.

కరోనా థర్డ్‌వేవ్‌ భయాందోళన మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఇవాల్టి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. తరగతుల నిర్వహణపై విద్యాశాఖ పలు సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. తరగతి గదికి 20 మంది విద్యార్ధులు మించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి స్కూల్‌కి ఎస్‌వోపీ ఉండాలని తెలిపింది. విద్యార్ధుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలని పేర్కొం‍ది. నాడు- నేడు కార్యక్రమంతో ఏపీలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సర్వాంగ సుందరంగా రుపుదిద్దుకున్న పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి.

మరోవైపు సీఎం జగన్‌ ఇవాళ విద్యాకానుక పథకాన్ని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ప్రారంభించనున్నారు. మొత్తం 47.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక అందిస్తారు. కిట్టులో బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, వర్క్ బుక్కులు, 3 జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బాగ్ ఇవ్వనున్నారు. ఈసారి అదనంగా ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందించనున్నారు.

అయితే స్కూల్స్‌ ప్రారంభించడంపై తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. టీచర్లకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని స్కూళ్లు ప్రారంభానికి ముందే వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఈ పిల్‌లో కోరారు. శ్రీకాకుళానికి చెందిన టీచర్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై కోర్టు పిటిషనర్ తరపున వాదనలు విని, ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. టీచర్లు రోజూ విద్యార్థులతో మాట్లాడుతున్నారని అందువల్ల టీచర్లకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

ఈ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది.... 85% టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తిచేశామని వివరణ ఇచ్చారు. అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఈ కేసును ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. కానీ స్కూల్స్ రీ ఓపెన్ నిలుపుదల చేయాలని ఆదేశించలేదు. దీంతో పాఠశాలలు పునః ప్రారంభించేందుకు రెడీ అవుతోంది ఏపీ ప్రభుత్వం.

అయితే స్కూల్ రీ ఓపెన్ చేయోద్దని హైకోర్టు మెట్లెక్కిన పిల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని కొందరు తల్లిదండ్రులు స్కూల్ రీ ఓపెన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఉంటే, మరికొందరు కరోనా నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే భయపడుతున్నారు. ప్రభుత్వం స్కూళ్లు తెరిచినా తమ పిల్లల్ని పంపించేందుకు ఆసక్తి చూపడం లేదు. కోవిడ్ ధర్డ్ వేవ్ భయాల వేళ ప్రభుత్వం స్కూళ్లు తెరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తల్లితండ్రులు అసంతృప్తిగా ఉన్నారు. కానీ ఏపీ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. స్కూళ్లు ప్రారంభించాలని సీఎం జగన్‌ పట్టుదలతో ఉండటంతో ఇవాళ్టి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story