పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు.. నేడు నోటిఫికేషన్‌ జారీకి సన్నాహాలు

పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు.. నేడు నోటిఫికేషన్‌ జారీకి సన్నాహాలు
తమ ఆదేశాల ప్రకారం కలెక్టర్లు ఎన్నికలకు సిద్ధం కావాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది

పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో శుక్రవారం రోజంతా అత్యంత నాయకీట పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో SEC శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమైన నిమ్మగడ్డ... తాజా పరిణామాలు వివరించారు. హైకోర్టు తీర్పు, ఎన్నికల షెడ్యూల్, ప్రభుత్వం సహకరించాలనే అంశాలపై చర్చించారు.

ఇవాళ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయనుండటంతో ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించాలని భావించారు. ముఖ్యమంత్రితో సమావేశం ఉందని అధికారులు గైర్హాజరయ్యారు. భేటీని మధ్యాహ్నం 3 గంటలకు మార్చినా ఫలితం లేకపోయింది. అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ... పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌కు మెమో జారీ చేశారు. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నానని సాయంత్రం 5 గంటలకు సమావేశానికి రావాలని ఆదేశించారు. అయినా అధికారులెవరూ రాకపోవడంతో నిమ్మగడ్డ ఆగ్రహంతో కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.

అటు.. SEC జారీ చేసిన మెమోను కూడా పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోలేదు. సీఎం జగన్‌తో సమావేశమైన పంచాయతీరాజ్‌శాఖ ప్రధాన కార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఆ తర్వాత.. CS ఆధిత్యనాథ్ దాస్‌తోనూ భేటీ అయ్యారు. అనంతరం SECకి CS నోట్‌ పంపారు. సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని నిర్ణయం వెలువడే వరకు ఆగాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదని... ఎన్నికలు తప్పనిసరయితే వ్యాక్సినేషన్ నిలిపివేయాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదే అంశంపై ప్రభుత్వం, అధికారులు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సోమవారం వాదనలు వింటామని తెలిపింది.

మరోవైపు.. పలు జిల్లాల అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో పాటు.. తిరుపతి అర్బన్‌ ఎస్పీలను బదిలీ చేయాలని సీఎస్‌కు, డీజీపీకి రాసిన లేఖలో కోరారు. పలమనేరు, శ్రీకాళహస్తి DSPలతో పాటు మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు వేగవంతం చేసింది ఎస్‌ఈసీ. ఈ నెల 25 కల్లా తాజా ఓటర్ల జాబితా సమర్పించాలని పంచాయతీరాజ్‌ శాఖను ఆదేశించింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన.. ఓటర్ల జాబితా సమర్పించాలని తెలిపింది. ఈ నెల 25నాటికి జిల్లా పంచాయతీ అధికారులు.. ఎన్నికలకు నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. గతేడాది మార్చి 7న తయారు చేసిన ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకుంది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకు ఇచ్చిన హామీని.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని పేర్కొంది.

హైకోర్టుకు ఇచ్చిన హామీల ఉల్లంఘనపై విడిగా చర్యలు చేపడతామని స్పష్టంచేసింది. ఎన్నికలపై చర్చించేందుకు రావాలని కోరినా.. అధికారులు పట్టించుకోకపోవడంపై ఎస్‌ఈసీ అసంతృప్తి వ్యక్తంచేసింది. తమ ఆదేశాల ప్రకారం కలెక్టర్లు ఎన్నికలకు సిద్ధం కావాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు.. 13 జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. జిల్లాల ఎస్పీలు, ముఖ్య అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని ఆదేశించారు. ఈ సమావేశానికి అధికారులు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠను రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story