దూకుడు పెంచిన ఎస్‌ఈసీ.. గవర్నర్‌తో భేటీ కానున్న నిమ్మగడ్డ రమేష్‌

దూకుడు పెంచిన ఎస్‌ఈసీ.. గవర్నర్‌తో భేటీ కానున్న నిమ్మగడ్డ రమేష్‌
ఎన్నికల ఏర్పాట్లు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ఎస్‌ఈసీ వివరించనున్నారు.

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్ ఇవాళ గవర్నర్‌తో భేటీ కానున్నారు. ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఆయన సమావేశం అవుతారు. ఎన్నికల ఏర్పాట్లు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ఎస్‌ఈసీ వివరించనున్నారు. ఎస్‌ఈసీతో భేటీ తర్వాత గవర్నర్‌ను సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌ కలవనున్నారు. ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను.. ఎస్‌ఈసీకి అందికిస్తున్న సహకారాన్ని వివరించనున్నారు.

ఇక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, పంచాయతీరాజ్‌, వైద్యారోగ్యశాఖ అధికారులు సమావేశానికి హాజరవుతారు. సమీక్షకు హాజరు కావాలని ఈ మేరకు సీఎస్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఎస్‌ఈసీ ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. పంచాయతీల్లో నామినేషన్లకు ఏర్పాట్లు, ఓటర్ల జాబితా రూపకల్పన తదితర అంశాలపై సూచనలు ఇవ్వనున్నారు. భద్రతాపరమైన అంశాలపైనా సమావేశంలో చర్చించనున్నారు.

కొత్త షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 9న తొలిదశ, 13న రెండో దశ, 17న మూడో దశ, 21న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 9న జరిగే ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 29న ప్రారంభమవుతుంది. 13న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 2 నుంచి, 17న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 6 నుంచి, 21న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story