జనసేనకు షాక్ ఇచ్చిన బీజేపీ!

జనసేనకు షాక్ ఇచ్చిన బీజేపీ!

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధినే నిలబెడతామని రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటన చేశారు. బీజేపీ కోసం జనసేన చేసిన త్యాగం వృధా అయినట్టే కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి.. ప్రచారాన్ని ప్రారంభించే సమయానికి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు పవన్. ఏ ఒప్పందం జరిగిందో తెలీదు గాని.. గ్రేటర్ ఎన్నికల నుంచి తప్పుకుంది జనసేన. ఇందుకు బదులుగా తిరుపతిలో జనసేన అభ్యర్ధికే టికెట్ ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కోరారు పవన్. స్వయంగా ఢిల్లీ వెళ్లి.. రెండు రోజుల పాటు అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేశారు. చివరికి కమిటీ తేల్చుతుందని చెప్పడంతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చారు.

జనసేన-బీజేపీ బంధం పేరుకేనా? కలిసి పనిచేస్తామనే మాట కేవలం మాటవరసకేనా? ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. జనసేన అభిప్రాయాలను బీజేపీ పరిగణలోకి తీసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, తిరుపతిలో జనసేన, బీజేపీ కూటమి తరువాత ఎవరు బరిలోకి దిగాలనే అంశాన్ని రెండు పార్టీల ప్రతినిధులతో కూడిన కమిటీ నిర్ణయిస్తుందని పవన్ ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతనే కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కాని, తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే దానిపై జనసేన-బీజేపీ మధ్య చర్చలు జరిగినట్టుగా గాని, కమిటీ వేశారని గాని ఏ వార్తా రాలేదు. కాని, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్ధినే గెలిపించాలంటూ ఓ మాట అనేశారు సోమువీర్రాజు. ఇదేం అనాలోచితంగానో, పొరపాటునో చేసిన కామెంట్స్ కావు. సునీల్ దేవధర్ సహా పలువురు ముఖ్యనేతలు పక్కన ఉండగానే సోమువీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.

జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థికి ప్రజలు ఓటు వేయాలని నొక్కి చెప్పడంపై జనసేనలో కలవరపాటు మొదలైనట్టు తెలుస్తోంది. సునీల్ దేవధర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్న రోడ్ షోలో సోము సోము వీర్రాజు ఈ కామెంట్స్ చేశారంటే.. ఇక జనసేనకు టికెట్ ఇచ్చే ఉద్దేశం లేదనే అర్థం అంటున్నారు విశ్లేషకులు. ఈ రోడ్‌షోకు ముందు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో సమావేశమైన బీజేపీ నేతలు.. తిరుపతి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. ఆ తరువాత జరిగిన రోడ్‌ షోలో.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను కోరారు సోమువీర్రాజు. బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని తిరుపతి ప్రజలకు సోము వీర్రాజు హామీ ఇచ్చారు.

అయితే.. ఆదివారం తిరుమల దర్శనం అనంతరం సోమువీర్రాజు మరోసారి కీలక కామెంట్లు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో అభ్యర్ధి ఎవరనేది జనసేనతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. బీజేపీ, జనసేన కలిసే తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రకటించారు.

తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందడంతో.. త్వరలో తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీలు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ, వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి పోటీ చేయనున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని చెప్పడంతో.. కమలం పార్టీ తరపున అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది.


Tags

Read MoreRead Less
Next Story