Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో టీడీపీ పక్కా ప్రణాళిక..

Andhra Pradesh (tv5news.in)

Andhra Pradesh (tv5news.in)

Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్‌లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని టీడీపీ లేఖ రాసింది.

Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెలువడిన తాజా నోటిఫికేషన్‌లో ఆన్‌లైన్‌లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ లేఖ రాసింది. గత పరిణామాల దృష్ట్యా.. నామినేషన్ల ఉప సంహరణ సమయంలో అభ్యర్థులతో పాటు ఇతర వ్యక్తులను సాక్షులుగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబు లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌ను టీడీపీ నేతలు కోరారు. నామినేషన్ దాఖలు కేంద్రాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్ పత్రాలు స్కాన్‌ చేసుకుని సంబంధిత అధికారులకు అభ్యర్థులు ఈ-మెయిల్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో వాలంటీర్ల జోక్యం లేకుండా నిఘా పెట్టాలన్నారు. బలవంతపు ఏకగ్రీవాలను పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. సవరించిన ఓటర్ల జాబితా అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలన్నారు.

కొవిడ్‌ తీవ్రత దృష్టిలో పెట్టుకుని పోలింగ్‌ కేంద్రాలు పెంచాలని టీడీపీ నేతలు లేఖలో విజ్ఞప్తి చేశారు. గతంలో చోటు చేసుకున్న హింసాకాండ, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అధికారుల తీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా.. సూచనలను ఎస్‌ఈసీ పరిగణలోకి తీసుకోవాలని నేతలు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story